అక్రమ మైనింగ్‌కు ‘లీగల’ రంగు పూసే కుట్ర..
- రాజాపేట మండలం, చల్లూరు గుట్టలో అక్రమ మైనింగ్
- ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం శూన్యం
- సర్వే నెం. 322/4లో శ్రీని డెవలపర్స్ వారి నిర్వాకం
- ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు
- ఎన్నో కథనాలతో అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ఆదాబ్
- ఎట్టకేలకు తిరగబడ్డ స్థానికులు.. వివిధ పార్టీల నాయకులు
- అక్రమ మైనింగ్ పై రిపోర్ట్ పంపాలని కలెక్టర్ ఆదేశాలు
- అయినప్పటికీ స్పందించని సంబంధిత అధికారులు
ప్రజల ఆస్తులకు కాపలాదారుగా ఉండాల్సిన అధికార యంత్రాంగం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తుండటంతో, అక్రమార్కుల ఆగడాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, చట్టాలను చెత్తబుట్టలో వేసి.. కంకర మాఫియా కోట్లాది రూపాయలను కొల్లగొడుతోంది. అడిగే నాథుడు, అడ్డుకునే అధికారి లేకపోవడంతో ‘ఇల్లీగల్ క్రషర్ బిజినెస’ మÖడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పంచాయతీ నుంచి పొల్యూషన్ బోర్డ్ వరకు.. రెవెన్యూ, మైనింగ్, ఇలా ఏ ఒక్క విభాగం కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న ‘మర్మం’ ఏమిటి? వ్యవస్థలన్నీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక ఉన్న చీకటి కోణాలను ‘ఆదాబ్ ‘ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది..
ఇంత జరుగుతున్నా సర్కారు యంత్రాంగంలో చలనం లేకపోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రషర్ పై ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ పంపాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా, క్షేత్రస్థాయిలో ఆ అక్రమాన్ని ‘సక్రమం’ చేసేందుకు తెర వెనుక భారీ కుట్రలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న ‘పెద్ద తలలను’ కాపాడేందుకు వ్యవస్థలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసిన వారిని బోనులో నిలబెట్టాల్సింది పోయి, వారిని తప్పించే ప్రయత్నం జరుగుతుండటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.



‘చల్లూరు’ సెగ చుట్టుముడుతోంది.. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వ్యాపిస్తోంది.. ‘ఆదాబ’ అక్షర పోరాటానికి ఫలితం కనిపిస్తోంది.. అక్రమ క్రషర్ అరాచకంపై సమరశంఖం నినాదం ఇప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తోంది.. “మేల్కోండి.. మీ సంపదను కాపాడుకోండి” అంటూ వచ్చిన కథనాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను సంచలనం సృష్టించింది. రాజాపేట మండలం చల్లూరు గ్రామ సర్వే నంబర్ 322/4 వేదికగా సాగుతున్న ‘శ్రీని డెవలపర్స’ అక్రమ క్రషర్ దందాపై సాహసోపేత పరిశోధనాత్మక కథనాలు ఎట్టకేలకు అధికార యంత్రాంగం కోటలను తాకాయి.
ప్రకృతిని పిప్పి చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ క్రషర్ పై సరైన ఎంక్వయిరీ చేసి రిపోర్టులు పంపాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడం ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు.. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అక్రమాన్ని అడ్డుకోవాల్సిన అధికారులే, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి దాన్ని ‘సక్రమం’ చేసేందుకు రహస్యంగా పావులు కదుపుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నిన్నటి వరకు అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచిన కొందరు ‘కుహనా’ రాజకీయ నాయకులు, ఇప్పుడు తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. ఆధారాలతో సహా దొరికిపోయినా, వ్యవస్థలోని లొసుగులను వాడుకుని ఈ అక్రమ సామ్రాజ్యాన్ని మళ్లీ తెరిపించేందుకు విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి.



ఒక్కటైన విపక్షాలు.. వెల్లువెత్తుతున్న నిరసనలు :
అక్రమ క్రషర్ వల్ల పర్యావరణం విధ్వంసం కావడమే కాకుండా, చల్లూరు మల్బావాని చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్న వైనంపై స్థానికులు రగిలిపోతున్నారు. ఈ అరాచకానికి వ్యతిరేకంగా స్థానికులు, సామాజిక వేత్తలు, బీఆరఎస్, బీజేపీ నాయకులు కూడా ప్రజలతో కలిసి పోరాట బాట పట్టారు. “మల్బావాని చెరువు మట్టి సాక్షిగా సాగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట పడాల్సిందే! అధికారుల మౌనం వెనుక ఉన్న అవినీతి తిమింగలాలను బయటకు లాగాలి.” అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు..
ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో.. స్థానికులు, సామాజిక సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆగ్రహం వెలిబుచ్చుతున్నాయి.. ఎంతో కాలంగా ఈ అక్రమ క్రషర్ వ్యవహారంపై స్థానికులు, బీజేపీ, బీ.ఆర్.ఎస్. నాయకులు, సామాజికవేత్తలు పలు సందర్భాలుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకపోయింది.. చివరకు కలెక్టర్ ఈ అక్రమ క్రషర్ పై తగిన విచారణ జరిపి తక్షణమే రిపోర్ట్ పంపాలని మైనింగ్ శాఖ అధికారులకు, ఆర్దీఓ, ఎమ్మార్వో, పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకూ రిపోర్ట్ ఎందుకు పంపలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.. జరిగిన జాప్యంపై కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది కూడా తెలియాల్సి ఉంది..
కాగా అక్రమ క్రషర్లకు సహకరించిన అధికారులపై తక్షణమే వేటు వేయాలి. రాజకీయ అండదండలతో తప్పించుకోవాలని చూస్తున్న పెద్ద తలల గుట్టు రట్టు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ అరాచకాన్ని శాశ్వతంగా అరికట్టకపోతే, రాబోయే రోజుల్లో జరగబోయే ఉధృత ఆందోళనలకు, పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల ఆస్తిని, ప్రకృతి సంపదను కాపాడుకునే వరకు ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదని స్థానికులు, బీజేపీ స్థానిక నాయకులు, అదేవిధంగా బీ.ఆర్.ఎస్. నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు..
