- ప్రీ ప్రైమరీ కోర్సులకు ర్యాంకులు-గ్రేడులు
- మార్కుల వేటలో తగ్గుతున్న సృజనాత్మకత, పెరుగుతున్న మానసిక ఒత్తిడి
- మార్కులనే ప్రమాణంగా చూస్తున్న పేరెంట్స్, స్కూల్ యాజమాన్యాలు
- పోటీ భారంతో నలిగిపోతున్న పసిప్రాయం
చిన్నారుల బాల్యం ఆనందంగా, ఆటలతో నిండిపోవాల్సిన దశలోనే మార్కుల మోత మొదలవడం ఆందోళన కలిగిస్తోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ తరగతుల్లోనే ర్యాంకులు, గ్రేడులు ప్రకటించడం ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ట్రెండ్ మారిపోయింది. ఇంకా అక్షరాలు సరిగ్గా పలకలేని వయసులోనే “ఫస్ట్, సెకండ్” అనే గుర్తింపులు ఇవ్వడం బాల్యానికే భారమవుతోంది. పాఠశాలల్లో మార్కుల ఆధారంగా చిన్నారులను అంచనా వేయడం, ఇతరులతో పోల్చడం వల్ల వారి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతోందని మానసిక నిపుణులు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదువు అంటే ఆసక్తిగా ఉండాల్సిన దశలో, అది క్రమంగా ఒత్తిడిగా మారుతుండటంతో పిల్లల్లో పాఠశాల అంటే భయం, నేర్చుకోవడం పట్ల అసహనం పెరుగుతున్నాయి. మానసిక నిపుణుల ప్రకారం, ఈ వయసులో పిల్లలు పుస్తకాల జ్ఞానం కంటే ఎక్కువగా భావోద్వేగాలు, సామాజిక నైపుణ్యాలు, సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలి. కానీ మార్కుల కోసం పోటీ పెరగడంతో ఈ సహజ అభివృద్ధి దెబ్బతింటోందని వారు పేర్కొంటున్నారు. చిన్న వయసులోనే పోటీ భావన పెరగడం వల్ల ఆత్మవిశ్వాసలోపం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
ఇక తల్లిదండ్రుల వైఖరి కూడా అలాగే మారింది. “మా పిల్లలు వెనుకబడకూడదు” అనే ఆందోళనతో మార్కులపై అధిక ప్రాధాన్యం ఇస్తుండటం, స్కూల్ యాజమాన్యాలు కూడా అదే దిశగా చర్యలు తీసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ఫలితంగా చిన్నారులపై అనవసర ఒత్తిడి పెరుగుతోంది.
అయితే విద్యావేత్తలు మరో ముఖ్య అంశాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఈ దశలో చిన్నారులకు మార్కులే అవసరం లేదు. ప్రీ ప్రైమరీ స్థాయిలో పిల్లలను సంఖ్యలతో కొలవడం కంటే, వారి అభివృద్ధిని గమనించడం, ప్రోత్సహించడం ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అక్షరాలు నేర్చుకోవడం, మాట్లాడటం, ఆడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి అంశాలే అసలు అభ్యాసమని, వాటిని మార్కులతో కొలవడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేస్తున్నారు.
విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం, ప్రీ ప్రైమరీ దశలో ఆటల ద్వారా నేర్చుకోవడం, అనుభవాల ద్వారా అవగాహన పెంపు వంటి పద్ధతులు అమలు చేయాల్సిన అవసరం ఉంది. చిన్నారుల విద్యను మార్కుల పరిమితుల్లో బంధించకుండా, వారి సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
బండెడు పుస్తకాల భారం…
ఆటపాటలతో గడపాల్సిన ప్రీ ప్రైమరీ దశలో పిల్లలను పుస్తకాల పురుగుల్లా మార్చడం ఆందోళన కలిగించే అంశం. కార్పొరేట్ విద్యా సంస్థలు చిన్న పిల్లల మార్కులను కూడా ప్రచార అస్త్రాలుగా వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మార్కుల కోసం చదవడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతుందని, వారి మానసిక ఎదుగుదల దెబ్బతింటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించాలని, ప్రాథమిక స్థాయిలో పరీక్షలు నిర్వహించకూడదని ప్రభుత్వం మరియు విద్యా బోర్డులు సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇంకా “మార్కుల మోత” కొనసాగుతూనే ఉంది.
