- హెంప్ సీడ్స్ తీసుకోండి హ్యాపీగా వుండండి..
శాకాహారులు సరిపడా ప్రోటీన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలను పొందడం కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో హెంప్ సీడ్స్ ప్రయోజనాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్నగా కనిపించే ఈ విత్తనాలు శాకాహార ఆహారాన్ని సమృద్ధిగా మార్చగల శక్తి కలిగి ఉన్నాయని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. హెంప్ సీడ్స్ సంపూర్ణ ప్రోటీన్ వనరు. వీటిలో శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
అందువల్ల ప్రోటీన్ లోపం ఎదుర్కొనే శాకాహారులకు ఇవి ఉత్తమ ఎంపిక. వీటిని పొడి రూపంలో తీసుకుంటే బేకింగ్ ఐటమ్స్, సిరియల్స్, స్మూతీస్‌లో సులభంగా కలుపుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రోటీన్ మాత్రమే కాకుండా ఈ సీడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గించడంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణ పెంపులో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా హెంప్ సీడ్స్ సులభంగా జీర్ణమవుతాయి. ఇతర ప్లాంట్ ప్రోటీన్ వనరులతో పోలిస్తే వీటిలోని పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. ఈ సీడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చడం చాలా సులభం. సలాడ్స్‌లో కలపడం, స్మూతీస్‌లో బ్లెండ్ చేయడం, పెరుగు లేదా ముస్లీ, పొర్రిడ్జ్‌లో జోడించడం వంటి పద్ధతుల్లో తీసుకోవచ్చు. వీటి రుచి తేలికపాటి నట్ ఫ్లేవర్‌లా ఉండటం వల్ల ఇతర ఆహారాలతో బాగా కలిసిపోతుంది.
