తెలంగాణ సమాజం గర్వించదగ్గ ప్రజా విప్లవ గళం, దివంగత గద్దర్ (గుమ్మడి విఠల్ రావు)ని ‘తెలంగాణ జాతిపిత’గా గుర్తిస్తూ కంచ ఐలయ్య అధ్యక్షతలో బుధ వారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మేధావులు, ఉద్యమకారుల సదస్సులో చారిత్రాత్మక తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ‘గద్దర్ గళం’ సభ్యులు, ప్రముఖ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, విద్యార్థి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా యుద్ధనౌక గద్దర్ ని ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ జాతిపిత’గా ప్రకటించాలని ఈ సదస్సు డిమాండ్ చేసింది.
ఒకవేళ ప్రభుత్వం స్పందించని పక్షంలో, పల్లె పల్లెనా వ్యవస్థీకృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజలందరి భాగస్వామ్యంతో గద్దర్ ని ‘తెలంగాణ జాతిపిత’గా మేమే స్వయంగా ప్రకటించుకుంటామని వక్తలు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి వక్తలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక భూస్వామ్య నేపథ్యం ఉన్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని వారు ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తికే ఆ అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.
శరీరంలో బుల్లెట్లు ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు నిలకడగా పోరాడిన ఏకైక వ్యక్తి గద్దర్ అని, జాతిపితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ‘గద్దర్ గళం’ సభ్యులు కొల్లూరి సత్తయ్య, కొల్లూరి భరత్, ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సీనియర్ ఉద్యమకారులు పాశం యాదగిరి, పృథ్వీరాజ్ మరియు పలువురు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ విముక్తి కోసం గద్దర్ చేసిన త్యాగాలను స్మరిస్తూ, ఆయనను తెలంగాణ జాతిపితగా స్థాపించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ‘గద్దర్ గళం’ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సమావేశం కొనసాగింపుగా, ఏప్రిల్ 6న తెల్లాపూర్ లోని ‘గద్దర్ సర్కిల్’ వద్ద ‘గద్దర్ గళం’ ఆధ్వర్యంలో రోజంతా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు.
ఈ ప్రతిష్టాత్మక వేదిక ద్వారా గద్దర్ ని ‘తెలంగాణ జాతిపిత’గా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాజకీయ నాయకులు, ప్రజా గాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు మరియు ఉద్యమకారులు హాజరుకానున్నారు. తెలంగాణ నలుమూలల నుండి ప్రజలు, గద్దర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ‘గద్దర్ గళం’ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్టు, పృథ్వీరాజు క్రాంతి దళ్ తదితరులు పాల్గొన్నారు.
