- యూకే లోని క్రోడాన్ క్రౌన్ కోర్టులో ఘటన..
ఓ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు, జడ్జి కళ్ల ముందు నుంచే నిందితుడు పరారయ్యాడు. ఈ అనూహ్య ఘటన యూకే లోని క్రోడాన్ క్రౌన్ కోర్టులో చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడు న్యాయస్థానం నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యూకే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్తు పదార్థాలకు బానిసైన 26 ఏళ్ల అబు ఫాయేను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దాదాపు పది కేసులు నమోదయ్యాయి. మాదకద్రవ్యాలను కలిగి ఉండటమే గాక.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కేసుల్లో ఇటీవల అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తాను మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు నిందితుడు కోర్టు ముందు అంగీకరించాడు. దాంతో అతడిని పోలీసుల కస్టడీకి అప్పగించాలని జడ్జి నిర్ణయించారు.
ఈ క్రమంలోనే నిందితుడు భయంతో హఠాత్తుగా కోర్టు తలుపులు తెరుచుకొని పరారయ్యాడు. దాంతో పోలీసులతోపాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు కోర్టు వద్ద భద్రతాసిబ్బంది ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దాంతో పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపుచర్యలు చేపట్టారు.
తూర్పు లండన్‌లోని హాక్నీ ప్రాంతానికి చెందిన అబు ఫాయేకి కేంబ్రిడ్జి, పెంగే ప్రాంతాలతో సంబంధాలున్నాయి. దాంతో అతడు అక్కడే నక్కి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని గుర్తిస్తే ప్రజలు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. కాగా కోర్టు నుంచే నిందితుడు పారిపోవడం భద్రతా లోపమని విమర్శలు వస్తున్నాయి.
