Monday, March 30, 2026
Homeనల్లగొండAlair | వేదనతో నిండిన అంతిమ యాత్ర…

Alair | వేదనతో నిండిన అంతిమ యాత్ర…

  • తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

హృదయాన్ని కదిలించే విషాద ఘటన ఆలేరు పట్టణంలో చోటుచేసుకుంది. కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి మరణంతో కన్నీటి మేఘాల్లో మునిగిపోయిన ఇద్దరు కుమార్తెలు… వారిలో పెద్ద కుమార్తె తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమతో, కుమారుడి లోటును తీరుస్తూ తానే ముందుకు వచ్చి తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులను కలచివేసింది.

ఆలేరు పట్టణంలోని చాముండేశ్వరి వీధికి చెందిన ఎలగల శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. వెల్డింగ్ పనులు చేస్తూ రోజువారీ కూలీతో కుటుంబాన్ని పోషించిన ఆయన జీవితం మొత్తం పోరాటమే. భార్య కూడా దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబం రేకుల షెడ్‌లో నివసిస్తూ, కష్టాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తోంది.

- Advertisement -

ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉండగా, కుమారుడు లేడు. తండ్రి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం కలిసి ఇప్పటికే బాధల్లో ఉన్న ఈ కుటుంబానికి, ఆయన మరణం మరొక పెద్ద దెబ్బగా మారింది. ఇంటి ఆధారం కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

అంత్యక్రియల సమయంలో తండ్రికి తలకొరివి పెట్టేందుకు వారసుడు లేకపోవడంతో, పెద్ద కుమార్తె కన్నీళ్ల మధ్య ధైర్యంగా ముందుకు వచ్చింది. సంప్రదాయాలను పక్కనబెట్టి, తానే తండ్రికి చివరి కర్తవ్యాలు నిర్వర్తించింది. తండ్రి మృతదేహం ముందు నిలబడి వేదనతో విలపించిన ఆమెను చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. “నాన్న” అని పిలుస్తూ చేసిన ఆ చివరి వీడ్కోలు ప్రతి ఒక్కరి గుండెల్లో ముద్ర వేసింది.

కష్టాల్లో పెరిగిన ఆ కుమార్తె తండ్రిపై ఉన్న ప్రేమను ఈ ఘటన స్పష్టంగా తెలియజేసింది. కుమార్తెలు కూడా కుటుంబ బాధ్యతలను సమానంగా మోస్తారనే నిజాన్ని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. బాధలోనూ ధైర్యంగా నిలబడిన ఆమెను స్థానికులు ప్రశంసించడంతో పాటు, కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

ఆస్తిపాస్తులు, వ్యవసాయ భూములు ఏమీ లేని ఈ కుటుంబం కూలి పనులపైనే ఆధారపడి జీవిస్తోంది. కుటుంబానికి అండగా ఉన్న తండ్రి లేకపోవడంతో వారి జీవనం కొనసాగించడం కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా ఆడపిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. వారి భవిష్యత్తు దృష్ట్యా చదువులు నిరవధికంగా సాగాలంటే ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News