- మధ్యాహ్నం ట్రేడింగు ముగిసే సమయానికి బిఎస్సి, సెన్సెక్స్ పెరిగాయి..
భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,372 పాయింట్లు (1.89 శాతం) పెరిగి, 74,068 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 445 పాయింట్లు పెరిగి 22,957.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఒక దశలో 1700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా ఒక దశలో 23000 దాటింది. 30 షేర్ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఇండిగో, ఎల్ అండ్ టీ, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, లాగార్డ్ భారీ లాభాలు పొందాయి.
హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1.1 శాతం పెరిగాయి. అంతకుముందు మూడు సెషన్లలో కలిపి హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 11.7 శాతం తగ్గి, రూ 1,35,000 కోట్లు మార్కెట్ విలువ కోల్పోయింది. ఈ రోజు నిఫ్టీ స్మాల్‌క్యాప్100 0.77 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్100 1.10 శాతం పెరిగింది. ఇరాన్‌పై ఐదు రోజులపాటు దాడుల్ని నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లకు మంచి బలాన్నిచ్చింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగడం కలిసొచ్చింది. దీంతో సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు మంగళవారం లాభాలబాట పట్టాయి. ఇన్వెస్టర్ల సంపద మంగళవారం ఒక్క రోజే రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ విలువ రూ.423 లక్షల కోట్లకు చేరింది.
నేడు ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైంది. సోమవారం 72,696.39 వద్ద ముగిసిన సెన్సెక్స్ మంగళవారం ఉదయం 74,212.47 వద్ద లాభంతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ 93.86గా ఉంది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4,430 డాలర్ల వద్ద ట్రేడవుతోంది
