- పోలీసుల తీరుపై అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఆగ్రహం..
- బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
చండూరు మండల కేంద్రంలో ఈ నెల 15వ తేదీన బీజేపీ కార్యకర్తలపై జరిగిన హత్యా యత్నం, ఆపై పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లో ఫిర్యాదు నమోదైంది. బాధితుల తరపున అడ్వొకేట్ వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, డైరీ నంబర్ 5728/IN/2026ను కేటాయించింది.

ఘటన నేపథ్యం:
మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చండూరు ఎక్స్ రోడ్ వద్ద దోటి శివ సహా మరో ఎనిమిది మందిపై అసాంఘిక శక్తులు ముందస్తు పథకం ప్రకారం హత్యా యత్నానికి పాల్పడ్డాయి. ఈ దాడిలో కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అయితే, ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా స్థానిక పోలీసులు ఇప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకో పోవడం గమనార్హం.
పోలీసుల వైఫల్యంపై ధ్వజం:
పోలీసుల నిర్లక్ష్యాన్ని వినోద్ హిందుస్థానీ తన ఫిర్యాదులో తీవ్రంగా తప్పుబట్టారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోకపోగా, బాధితులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. అంతేకాకుండా, చండూరు సీఐ ఆదిరెడ్డి బాధితులను ఆదుకోవాల్సింది పోయి, వారిపైనే ఎదురు కేసులు (కౌంటర్ కేసులు) పెడతామంటూ బెదిరింపులకు దిగడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
ఫిర్యాదులోని ప్రధానాంశాలు:
తీవ్రమైన గాయాలైనప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం పోలీసుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
బాధితుల హక్కుల రక్షణ:
నిందితులకు కొమ్ముకాస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బెదిరింపులపై విచారణ:
సీఐ ఆదిరెడ్డి బాధితుల కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడంపై స్వతంత్ర విచారణ జరపాలని కమిషన్‌ను అభ్యర్థించారు.బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వినోద్ హిందుస్థానీ డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే ఏ అధికారిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
