- తెలిస్తే షాక్ అవుతారు..
హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు ఎంత ముఖ్యమో, పుణ్య తీర్థ యాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. పురాణాలు చెబుతున్నట్లు అనేక మహనీయులు, ఋషులు, పురాణ పురుషులు తీర్థయాత్రల ద్వారా ముక్తిని పొందారు. కొందరు కుటుంబంతోపాటు అందరూ కలిసి వెళ్లి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. అయితే, పెద్ద వయస్సువారే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో తీర్థయాత్రలకు పెద్దలు, వృద్ధులు వెళ్లాలా? అనే సందేహం ఏర్పడుతోంది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది క్షేత్ర దర్శనం వృద్ధాప్యంలో చేయాలి అని భావిస్తారు. కానీ, నిజానికి యౌవనంలోనే పుణ్యక్షేత్రాలను దర్శించడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో శక్తి ఉంటుంది, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం సులభంగా ఉంటుంది. వయసు మళ్లిన తర్వాత సమయం ఉన్నా.. శరీరం సహకరించకపోవచ్చు. అందువల్ల శక్తి ఉన్నప్పుడు దివ్యక్షేత్రాలను దర్శించి పుణ్యం సంపాదించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
దేవుడు ప్రతి చోటా ఉన్నప్పుడు అంత దూరం వెళ్లి క్షేత్ర దర్శనం చేయాల్సిన అవసరం ఏముంది? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడనే విషయం నిజమే. అయితే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన స్థల మహాత్మ్యం ఉంటుంది. దేవతలు, ఋషులు, మహనీయుల పాదస్పర్శతో ఆ ప్రదేశాలు పవిత్రమై ఉంటాయి. అక్కడి నదులు, నీటికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వసిస్తారు. అందుకే భారతీయ సంస్కృతిలో పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక స్థానం ఉంది.
