- ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు అన్ని రంగాలలో రాణించాలి.
- బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు.
సావిత్రిబాయి పూలే సమాజానికి మహిళా లోకానికి అందించిన సేవలు ఎనలేనివని చదువుల తల్లిగా, సంఘసంస్కారిణిగా ఆమె ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటుందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వరంగల్ కొత్తవాడలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో వెంకట్రాములు ప్రసంగిస్తూ చదువు అగ్రవర్ణాలకే పరిమితంచేసి, శూద్రులను, మహిళలను చదువుకు దూరంగా నెట్టివేసి, చదువు కోవడం పాపంగా భావించిన రోజుల్లో సమాజపు చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన అక్షర కిరణం సావిత్రిబాయి పూలే అన్నారు.
భర్త జ్యోతిబాపూలే ప్రోత్సాహంతో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి అనేక అవమానాలను ఆటంకాలెదురైన మొక్కవోని ధైర్యంతో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేశారని, చదువుల తల్లిగానే కాకుండా మూఢాచారాలకు, బాల్య వివాహాలకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన విప్లవకారిణి అని కొనియాడారు. దేశంలో ప్లేగు వ్యాధి సోకిన సమయంలో సావిత్రి బాయి ప్రాణాలకు తెగించి బాధితులకు సేవ చేశారని సామాజిక విప్లవ మూర్తిగా అక్షరము ఉన్నంతవరకు ఆమె జీవించే ఉంటారన్నారు.

నేటికీ సమాజంలో బీ.సి, ఎస్ సి, ఎస్.టి, బడుగు బలహీన వర్గాల మహిళలు ఇంకా వివక్షతకు గురవుతున్నారని వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ మహిళలు చైతన్య వంతులై విద్యా, సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ వాణిజ్య రంగాలన్నింటిలో రాణించేందుకు సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో కృషి చేయాలన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు దీక్షతో కృషి చేయడమేనిజమైననివాళులుకాగలవన్నారు. ఈ కార్యక్రమంలో లింగబత్తిని శంకర్, బాసబత్తిని శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, ప్రశాంత్, లక్ష్మి, రమాదేవి, ఎం. పద్మ, పుణ్యవతి, రజిత, రమా, బి రాధ, నగ్మా ,భాను, ప్రియాంక, లలిత, రాణి, అనూష తదితరులు పాల్గొన్నారు.
