- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అదనపు కలెక్టర్లకు సమర్పించారు.

ప్రజావాణి కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టంగా అమలుపరచాలని పేర్కొన్నారు. త్వరలోనే పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవ్వనున్నందున, మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్లి, విద్యార్థులతో మాట్లాడి వారికి సూచనలు చేయాలని తెలిపారు. ఈప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

