- పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రధానం
- ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు
కరీంనగర్ నగరంలోని రేకుర్తి లో గల కోట పబ్లిక్ స్కూల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడ ఉత్సవ్ కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి క్రీడా ఉత్సవాలు విద్యార్థుల్లో పోటీ తత్వం, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కోట పబ్లిక్ స్కూల్ విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
అనంతరం కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి కూడా క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డి అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి పాఠశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని కూడా కోట విద్యాసంస్థల చైర్మన్ డా. డి. అంజిరెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలించిన ఆయన వారి ప్రతిభను ప్రశంసించారు. చిన్న వయస్సులోనే వంట కళపై ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో సహాయపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా ఉత్సవ్‌లో అథ్లెటిక్స్, పరుగులు, జంప్స్, టీమ్ గేమ్స్ తదితర పోటీలు నిర్వహించి విజేతలను సత్కరించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.
