- ఓయు వీ.సి కుమార్ మొలగరం
- జనాభా దామాషా ప్రకారం వివిధ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి-జాజుల శ్రీనివాస్ గౌడ్
- బీసీలకు 42% రిజర్వేషన్లపై ఓయులో జాతీయ సదస్సు
సామాజిక న్యాయం,సమానత్వం,సరైన ప్రాతినిధ్యం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాదులని ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం పేర్కొన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ (ఉకా &ఎస్ఎస్) రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో వెనుకబడిన తరగతులకు (బీసీస్) 42% రిజర్వేషన్లు,సామాజిక న్యాయం విధానాలు,సవాళ్లు,భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై శుక్రవారం ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షత వహించి చీఫ్ పేట్రన్,సెషన్ చైర్మన్‌గా పాల్గొన్నారు.ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు విద్య,ఉపాధి మరియు పాలనలో సమాన అవకాశాలు కల్పించడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని తెలిపారు.రాష్ట్ర జనాభాలో సుమారు 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.సమాజంలో ఈక్వలిటీ మరియు ఏక్విటీ రెండూ సమానంగా అవసరమని,రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో సుమారు 60 శాతం జనాభా ఉన్న బీసీలకు తగిన అవకాశాలు కల్పించకపోతే భారతదేశ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
బీసీఐఎఫ్ అధ్యక్షుడు,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సాధికారతకు రాజ్యాంగపరమైన రక్షణలు, విధానపరమైన సంస్కరణలు అవసరమని అన్నారు.ఈ సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు,ప్రొఫెసర్ ఎస్.సుదర్శన్ రావు,ప్రొఫెసర్ ఎం.స్వర్ణలత తదితరులు బీసీ రిజర్వేషన్ల చారిత్రక,రాజ్యాంగ,రాజకీయ,సామాజిక అంశాలపై విశ్లేషణ చేశారు.
