ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. సురక్షితంగా తన ఇంటికి చేరుకున్నది. గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడంతో.. దుబాయ్ విమానాశ్రయంలో సింధు చిక్కుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సింధు.. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయింది. అయితే బెంగుళూరులోని తన ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్లు సింధు ఇవాళ తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించింది.
గత కొన్ని రోజులు ఉత్కంఠంగా, అయోమయంగా సాగినట్లు ఆమె చెప్పింది. స్వంత ఇంటికి చేరుకోవడం సంతోషకరంగా ఉన్నట్లు పేర్కొన్నది. దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. కష్ట సమయాల్లో చాలా కేర్ తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నది. ఇక రెస్ట్ తీసుకుని మళ్లీ ఉత్తేజాన్ని పొంది, తదుపరి అడుగులు వేయాల్సి ఉందని సింధు తన ట్వీట్‌లో తెలిపింది.
