Monday, March 2, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNarayana School | పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న 'నారాయణ'..!

Narayana School | పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ‘నారాయణ’..!

  • అన్నీ తెలిసి కూడా వారి వలలో చిక్కుకుంటున్న తల్లి దండ్రులు..
  • ప్రభుత్వాలను, అధికారులను సైతం శాసిస్తున్న నారాయణ..
  • ఆర్.ఆర్. డిస్ట్రిక్ట్, శేరిలింగం పల్లి మండలం, అయ్యప్ప సొసైటీలో విస్తుపోయే నిజాలు..
  • నారాయణ స్కూల్ బిల్డింగ్కు పరిమిషన్ లేదు..
  • అక్కడ కాలేజీ నడపడానికి అనుమతులు లేవు..
  • అనుమతులు లేని పాఠశాలలో అడ్డగోలుగా అడ్మిషన్లు..
  • మొద్దునిద్రపోతున్న అధికారులు, స్థానిక నాయకులు..

అక్కడ పసిపిల్లల ఆర్తనాదాలు వినిపిస్తుంటాయి.. ఆరోగ్యాలు చెడగొట్టుకుని క్షణ క్షణం మధనపడుతూ తల్లిదండ్రుల కోసం త్యాగాల ఉచ్చులో చిక్కుకుని అలమటిస్తున్న పసిపిల్లల జీవితాలు కనిపిస్తాయి.. చదువుల మాట అటుంచి. జీవితాలను కోల్పోతున్న అభాగ్య పిల్లల కథనాలు పుంఖాను పుంఖాలుగా వెలుగు చూస్తుంటాయి.. ఆ పాఠశాలకు బిల్డింగ్ పర్మిషన్ లేదు.. స్కూల్ నడిపేందుకు అనుమతులు లేవు.. అక్కడ వసతులు కూడా అద్వాన్నంగా ఉన్నాయి.. పిల్లలకు తాగడానికి నీళ్లు లేవు.. ఓ బోర్ నుంచి వచ్చే మురికినీళ్ళే గతి.. అవే నీళ్లు హాస్టల్ స్టూడెంట్స్ కు పెట్టే ఆహారం వండటానికి ఉపయోగిస్తున్నారు..

పిల్లలు అనారోగ్యాలపాలైనా వారికి పట్టింపులేదు.. స్కూల్ బిల్డింగ్ కు ఎలాంటి రక్షణ సదుపాయాలు లేవు.. ఫైర్ సేఫ్టీ కూడా లేదు.. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వందలమంది విద్యార్థులు బూడిదైపోతారు.. అంతే కాకుండా నారాయణ విద్యాసంస్థల దాష్టీకానికి బలైపోయిన పసి పిల్లలు ఎంతమందో..? ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోతను రగిల్చారు.. ఈ పాపం ఎవరిది..? విద్యాసంస్థలను నడుపుతున్న యాజమాన్యానిదా..?

- Advertisement -

పట్టించుకోకుండా పోతున్న ప్రభుత్వానిదా..? లంచాలు తీసుకుని మిన్నకుండిపోతున్న సంబంధిత అధికారులదా..? ఆడంబరాలకు పోతున్న తల్లి దండ్రులదా..? నిజానికి వీరందరిదీ పాపమే.. కోడిపిల్లల్లాగా గుంపులుగా ఒకచోట చేర్చి, అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నారాయణ విద్యా సంస్థల అరాచకాలను అరికట్టలేకపోతున్న ప్రభుత్వం, అధికారులు సిగ్గుతో తలొంచుకోవాలి..

రంగారెడ్డి జిల్లా పరిధి, శేర్లింగంపల్లి మండలంలోని, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు యథేచ్ఛగా నడుస్తున్నాయి.. కాగా ఈ పాఠశాలల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి సిసింద్రీ రావు నిర్లక్ష్య వైఖరి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే కాకుండా అనుమానాస్పదంగా కూడా కనిపిస్తోంది.మరీ ప్రత్యేకంగా శేర్లింగంపల్లి మండలం పరిధిలో నిబంధనలు పాటించని నారాయణ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి.

తల్లిదండ్రులు, విద్యార్థులు పలుమార్లు మండల విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటయ్యని ఆశ్రయించినా స్పందన కరువవడం బాధాకరం. విద్యాశాఖ అధికారులు ప్రజల సేవకులా లేక కార్పొరేట్ విద్యాసంస్థల తొత్తు అధికారులా అన్న సందేహం కలుగుతోంది.. అనుమతులు లేని పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి? ఎవరి అండదండలతో కొనసాగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా, మండల విద్యాశాఖ అధికారులపై ఉంది. నిర్లక్ష్యం, మౌనం, ఆలస్యం..

ఇవి సమస్యకు పరిష్కారం కావు. బాధ్యత నుంచి తప్పించుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానం.కాగా శేరిలింగం పల్లి, మండలం, మాదాపూర్, అయ్యప్ప సొసయిటీ, వారాహి క్యాంపస్ లో నెలకొనివున్న నారాయణ విద్యాసంస్థను తనిఖీచేసి, ఆ స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? అన్న విషయంపై సరైన రిపోర్ట్ పంపమని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి, శేరిలింగం పల్లి మండల విద్యాశాఖాధికారి 12 ఫిబ్రవరి 2025 నాడు ఒక లెటర్ పంపడం జరిగింది.. జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వుల ప్రకారం మండల విద్యాశాఖాధికారి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది..

తూ తూ మంత్రంగా స్కూల్ బిల్డింగ్ లోని ఒక గదికి మాత్రం సీల్ వేసి చేతులు దులుపుకోవడం జరిగింది.. అధికారులు అటు వెళ్ళగానే సీల్ వేసిన తాళాన్ని తొలగించి యధావిధిగా క్లాస్ రూమ్ ని తెరిచిన స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.. కాగా జీవో నెంబర్ 1, తేదీ 1-1-94 పరాకారం గుర్తింపు లేకుండా పాఠశాల నడపడం తీవ్రమైన ఉల్లంఘన.. అలాగే ఇదే జీవో లో ప్రస్తావించినట్లు రూల్ . 15 స్కూల్ కి గవర్నింగ్ బాడీ లేకపోవడం.. రూ – 16 ప్రకారం అధిక ఫీజులు వసూలు చేయడం నేరం.. ఇక అలాగే జీవో నెంబర్ : 41/ ఎడ్యుకేషన్ తేదీ 11-5-2006 ప్రకారం స్కూలు భవనాలకు ఉండవలసిన కనీస సౌకర్యాలు లేకపోవడం కూడా నేరం..

ఈ జీవోలను ఖాతరు చేయకుండా నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం విద్యా సంస్థలను నడుపుతోంది.. మరి వీరిని కట్టడి చేయడంలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు వెనుకంజ వేస్తున్నారు..? డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన పిల్లల భవిష్యత్తుతో ఆదుకోవడానికి ఏమి హక్కు వుంది..? పసివారి భవిష్యత్తును అంధకారం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న నారాయణ విద్యాస్తల యాజమాన్యం అకృత్యాలు ఆపగలిగే వారు లేరా..? నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడి కనుమరుగైపోతోందా..?

దాని స్థానంలో నేటి బాలలే కుహనా విద్యాసంస్థల యాజమాన్యాలకు కోట్లు తెచ్చిపెట్టే యంత్రాలుగా మారిపోతున్నాయి అన్న నానుడి ఇప్పుడు రాజ్యం ఏలుతోంది.. అంతే కాకుండా నిరుపేదల అక్రమ నిర్మాణాలను కూలగొట్టి వారికి ఆశ్రయం లేకుండా చేస్తున్న హైడ్రా లాంటి సంస్థలు నారాయణ లాంటి బడా బాబుల అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదు.. ఎక్కడ అక్రమ నిర్మాణం జరిగినా ఉపేక్షించబోమంటూ ఉపన్యాసాలు పలికిన రంగనాథ్ గారు ఏమి చేస్తున్నారు..? నారాయణ పలుకుబడి ముందు తలొంచారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. సమాజానికి వీళ్ళందరూ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు..?

కనుక తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. లేని పక్షంలో తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కలిసి చట్టబద్ధమైన మార్గాల్లో నిరసనను మరింత బలంగా వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే ఏ విధానాన్నీ సహించబోమని స్పష్టంగా తెలియజేశారు.. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమ బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

అక్రమార్కులతో అంటకాగుతూ లక్షలు వెనుకేసుకుంటున్న కొందరు విద్యాశాఖ అధికారులు, కొందరు ఉన్నతాధికారులపై నిఘా సంస్థలు, ఏసీబీ అధికారులు దృష్టిపెడితే.. తీగలాగితే డొంక కదిలినట్లు అవినీతి తిమింగలాలు బయటకు వస్తాయి.. ఆదిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News