- గుడిసెలు వేసుకుని జీవిస్తున్న సుమారు 500 పేద కుటుంబాలు..
- అవి భూదాన్ బోర్డుకు చెందుతాయని తెలిపిన అధికారులు..
- ఎనిమిదేళ్లుగా అక్కడే ఉంటున్నా ఇప్పటికి తెలిసొచ్చిందా..?
- సుమారు 3000 మంది పోలీసుల పహారాలో కూల్చివేతలు..
- నిద్రలేవకముందే కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులు..
- బోరుమని విలపిస్తున్న బాధితులు.. ఖండించిన విపక్షాలు..
- ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం అన్యాయం..
- కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్న సామాజికవేత్తలు..
ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల (వినోబా నగర్) ప్రాంతంలో మంగళవారం రోజు జరిగిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెలుగుమట్ల పరిధిలోని భూదాన భూముల్లో గత ఎనిమిదేళ్లుగా సుమారు 500 నుండి 600 పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాయి. అయితే, ఈ భూమి ప్రభుత్వానికి/భూదాన బోర్డుకు చెందుతుందని, అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే మంగళవారం రోజు ఉదయం భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు.
కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఖమ్మం, కొత్తగూడెం, పొరుగు జిల్లాల నుండి సుమారు 3,000 మంది పోలీసులు, డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. తెల్లవారుజామునే అధికారులు బుల్డోజర్లు, ట్రాక్టర్లతో అక్కడికి చేరుకుని నివాసాలను తొలగించడం ప్రారంభించారు. సుమారు 18 నుంచి 31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడిసెలను నేలమట్టం చేశారు. కాగా తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, కనీస నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా తమ గూడు చెడగొట్టడం అన్యాయమని బాధితులు రోదిస్తున్నారు.

“రేవంతన్న, సీనన్న అని నమ్మి ఓటేస్తే మమ్మల్ని రోడ్డున పడేశారు” అంటూ మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొంతమంది బాధితులు బుల్డోజర్ల పైకి ఎక్కి నిరసన తెలిపారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు మీడియాను కూడా లోపలికి అనుమతించకపోవడంతో జర్నలిస్టులకు, పోలీసు లకు మధ్య కూడా స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. కోర్టు తీర్పు మేరకే ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. వేల మంది పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చడం హేయమని, బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం వెలుగుమట్ల ప్రాంతంలో మంగళవారం సాయంత్రం వరకు కూడా ఉద్రిక్తంగానే ఉంది. బాధితులు తమ సామాన్లతో రోడ్డుపైనే ఉండిపోయారు.
వెలుగుమట్ల భూదాన భూముల కూల్చివేతల కవరేజ్ కోసం ఖమ్మం వెళ్తున్న రఘును పోలీసులు నకిరేకల్ సమీపంలో అడ్డు కున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆపి, బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి లాక్కెళ్లినట్లు సమాచారం. శాంతి భద్రతల దృష్ట్యా, వెలుగుమట్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జర్నలిస్ట్ సంఘాల స్పందన:
ఒక జర్నలిస్ట్ తన వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా కవరేజ్కు వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ అరెస్టును ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. ఈ ఉదయం జరిగిన కూల్చివేతల్లో బాధితుల పక్షాన నిలబడకుండా, వార్తలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
