- పాత ఫీజులకు భారీగా కోత..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. బీటెక్ కోర్సుల ఫీజులను భారీగా తగ్గించనున్నది. ఏకంగా ఇదివరకు అమలైన పాత ఫీజులకు కోతపెట్టింది. ఫీజులు తగ్గించిన కాలేజీల్లో అత్యధికం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కాలేజీలే ఉన్నాయి. బీఆర్‌ఎస్ నేతల కాలేజీలను టార్గెట్ చేసుకుని మరీ ఫీజులు తగ్గించారు.
మొత్తం 19 కాలేజీల్లో ఫీజులు తగ్గించగా 15 వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కాలేజీలే ఉన్నాయి. ఇందులో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలున్నాయి.
అనురాగ్ విద్యాసంస్థల కాలేజీలకు రూ. 35,100 వరకు తగ్గించారు. ఇవేకాక నల్ల మల్లారెడ్డి కాలేజీ ట్యూషన్ ఫీజును ఏకంగా రూ. 45వేలు తగ్గించారు. గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫీజును రూ. 43వేలకు కోతపెట్టారు. ఈ విషయం చివరికి హైకోర్టుకు చేరింది. విద్యాసంవత్సరం ముగింపునకు చేరుకున్నా ప్రభుత్వం ఫీజులను ఖరారుచేయకపోవడంతో కొన్ని యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఇదే విషయం కోర్టు విచారణలో ఉంది.
రాష్ట్రంలో మొత్తం 157 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2025 -28 విద్యాసంవత్సరానికి ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్‌ఆర్సీ) ఓ నివేదికను సిద్ధం చేసి సర్కార్‌కు సమర్పించింది. ఓ ఐదు కాలేజీల ఫీజుల సవరణకు ప్రతిపాదనలు సమర్పించలేదు. అంటే ఇవి మూతపడ్డట్టే లెక్క. కాగా 63 కాలేజీల్లో ఫీజులను పెంచారు. మరో 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించారు.
