- ఫుడ్ డెలివరీ విభాగంలో సత్తా చాటేందుకు సిద్ధం..
- నష్టంలో కూరుకుపోయిన స్విగ్గి, జొమాటో..
వాల్‌మార్ట్ కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. ఫుడ్ డెలివరీ విభాగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నదన్న వార్తల నేపథ్యంలో.. ఇప్పటికే ఈ రంగంలో హవా నడిపిస్తున్న స్విగ్గీ, జొమాటోల షేర్లు గురువారం నష్టపోయాయి.
కాగా, ఈ ఏడాది మే-జూన్ నెలల మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు చేస్తున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరినాటికి గానీ, వచ్చే ఏడాదికల్లా గానీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.
స్విగ్గీ, జొమాటో తరహాలో స్టాండ్ అలోన్ ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పాలా..? లేదా ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో బయ్యర్ సైడ్ అప్లికేషన్‌ను ఏర్పాటు చేయాలా..? అనే ఆప్షన్లను ప్రస్తుతం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ, జొమాటోల హవా కొనసాగుతున్నది. ఈ రంగంలోకి రావడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నించినా అవేవీ పెద్దగా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో వాల్‌మార్ట్ లాంటి పెద్ద సంస్థ అండ ఉన్న ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించబోతోందన్న వార్తలు.. స్విగ్గీ, జొమాటోల షేర్లపై ప్రభావం చూపాయి. జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ షేరు విలువ 2 శాతం మేర పతనమై రూ.291.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కోలుకుంది.
స్విగ్గీ షేర్ విలువ కూడా ఓ దశలో 3 శాతానికి పైగా నష్టంతో రూ.328 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కొద్దిగా పుంజుకుంది. గతంలో క్యాబ్ సర్వీస్ సంస్థ ర్యాపిడో కూడా ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెడుతోందన్న వార్తలు రావడంతో.. స్విగ్గీ, జొమాటోల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
