- మున్సిపల్ ఎన్నికల్లో 48కి 48 గెలుపే కాంగ్రెస్ లక్ష్యం.
- సంక్షేమ పథకాలు, అభివృద్ధితోనే ప్రజల మద్దతు.
- సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్న మంత్రి.
- డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.
- పట్టణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయాలి.
- వైశ్య కమ్యూనిటీకి చైర్మన్ అభ్యర్థి నివేదిత కి సముచిత గౌరవం.
- రాష్ట్ర పౌరసరఫరాల, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ 48కి 48 వార్డులు గెలుచుకుని పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ముందుగా దివంగత నాయకుడు శ్రీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి (దామన్న) గారికి నివాళులు అర్పించారు.
సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొంటుండటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌గా పని చేసి, ప్రచారంలో భాగంగా సూర్యాపేటకు వచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ అవసరాల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు.
అంతేకాకుండా, నాణ్యమైన సన్నబియ్యాన్ని రేషన్ ద్వారా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని అన్నారు. గతంలో రేషన్ బియ్యం దుర్వినియోగమై కోళ్ల ఫారాలు, అక్రమ వ్యాపారాలకు తరలిపోయేదని, సంవత్సరానికి రూ.12 వేల కోట్ల వ్యయం ప్రజలకు ఉపయోగం లేకుండా పోయేదని విమర్శించారు. ముఖ్యమంత్రితో చర్చించి ప్రజలకు తినదగిన సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, ప్రస్తుతం తెలంగాణలో 85 శాతం ప్రజలకు నెలనెలా నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు. గత పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో లక్షలాది రేషన్ కార్డులు మంజూరు చేసి సుమారు 40 లక్షల మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చామని తెలిపారు.
ఇళ్ల నిర్మాణం విషయంలోనూ గత పాలకుల వద్ద స్పష్టమైన గణాంకాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. సూర్యాపేట పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, పారిశుద్ధ్యాన్ని మరింత బలోపేతం చేసి, మున్సిపాలిటీని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే ఈ నెల 11న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.
బీజేపీ లేదా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం అంటే ఇంటి ముందు మురుగు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. 2028 నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా అధికారంలోకి రానుందని, సూర్యాపేట మున్సిపాలిటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి 48 కి 48 కౌన్సిలర్లను గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గానికి ఎస్సారెస్పీ ఫేజ్-2 ద్వారా నీటిని తీసుకెళ్లే పనులు కొనసాగుతున్నాయని, దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే 29 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఒక్క సీజన్‌లోనే 149 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు.
జిల్లా మంత్రిగా రాజకీయాలకు అతీతంగా సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా అంతటా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని సభ ముఖంగా మాటిచ్చారు. నాలుగు నియోజకవర్గాల పార్లమెంట్ ఎన్నికల్లో 70 వేలకుపైగా మెజారిటీ రావడం దేశంలోనే అరుదైన ఘనతగా పేర్కొన్నారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నివేదిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో తొలిసారిగా వైశ్య కమ్యూనిటీకి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుమ్మడి నరసయ్య, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నివేదిత లక్షది, పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ, నాయకులు చకిలం రాజేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
