Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Municipal Elections | బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలి

Municipal Elections | బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలి

  • బీసీలకు బీఫామ్‌లు ఇవ్వకపోతే మూడు పార్టీలకు మూల్యం తప్పదు
  • లేనిపక్షంలో బీసీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు-జాజుల శ్రీనివాస్ గౌడ్

ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం మున్సిపల్ చైర్మన్‌లు,కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించకపోతే కాంగ్రెస్,బీఆర్‌ఎస్,బీజేపీ మూడు పార్టీలకూ తగిన గుణపాఠం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీసీ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాంపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి,ఆ హామీని నెరవేర్చకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తుండటం దురదృష్టకరమన్నారు.ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్,బీజేపీలు కూడా ఈ అంశంపై మౌనం పాటిస్తూ ఎన్నికలకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు.ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని స్పష్టమైన విధాన ప్రకటన చేయకపోవడం బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

- Advertisement -

జనరల్ స్థానాల్లో ఇప్పటికే నామినేషన్లు వేసిన బీసీ అభ్యర్థులకు తప్పనిసరిగా బీఫామ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.జనరల్ స్థానాలు అంటే కేవలం రెడ్డి,రావులకే పరిమితం కాదని,జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించినప్పుడే వారికి రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు.సర్వేల పేరుతో బీసీలను పక్కనపెట్టి అగ్రకుల రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.సర్వేల పేరుతో బీసీలకు బీఫామ్‌లు నిరాకరిస్తే కాంగ్రెస్,బీజేపీ,బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పిస్తామని స్పష్టమైన విధాన నిర్ణయం ప్రకటించాలని,లేనిపక్షంలో బీసీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీసీ సామాజిక వేదిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఓయు ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్,చలమల్ల వెంకటేశ్వర్లు,డాక్టర్ పరంధాములు,బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డాక్టర్ వట్టికుటి రామారావుగౌడ్,డాక్టర్ సాంబశివగౌడ్,నిజ్జన రమేష్ ముదిరాజ్,జాజుల లింగంగౌడ్,స్వామిగౌడ్,నాగేశ్వరరావు,ఆర్.ఎల్. మూర్తి,సైదులు యాదవ్,దునుకు వేలాద్రి, డాక్టర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News