బాన్సువాడ ఎమ్మెల్యే(Banswada MLA) పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) రహదారి భద్రత అవగాహన కార్యక్రమం(ROAD SAFETY AWARENESS PROGRAMME)లో పాల్గొన్నారు. మీ రక్షణ మా బాధ్యత అని చెప్పారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం వరకు ప్రధాన రహదారిపై స్వయంగా హెల్మెట్(Helmet) ధరించి ద్విచక్ర వాహనం నడిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI ప్రమాణాలు కలిగిన హెల్మెట్లను ధరించాలని, వెనక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరని చెప్పారు.
లైసెన్స్(License), నైపుణ్యం(Skill) ఉన్నప్పుడే వాహనం నడపాలని, 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని వెల్లడించారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదాల బారినపడకుండా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, రూరల్ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య, పట్టణ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
