Friday, March 20, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐNRIs Day | ‘వికసిత్‌ భారత్‌’లో ప్రవాసీ భారతీయుల పాత్ర

NRIs Day | ‘వికసిత్‌ భారత్‌’లో ప్రవాసీ భారతీయుల పాత్ర

1915 జనవరి 9న మహాత్మాగాంధీ(Mahatma Gandhi) దక్షిణాఫ్రికా(South Africa) నుంచి స్వదేశానికి చేరిన రోజుకు గుర్తుగా ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయుల దినోత్సవం లేదా ప్రవాసీ భారతీయ దివస్‌(Pravasi Bharatiya Divas) లేదా నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ డే(Non-Resident Indians Day)గా 2003 నుంచి జరుపుకుంటున్నారు. ప్రవాసీ భారతీయుల నైపుణ్యాలు, మేధస్సు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, సంపదలను జన్మభూమి అభివృద్ధికి వినియోగించడాన్ని ప్రోత్సహించడం, ప్రవాసీలను సాదరంగా ఆహ్వానించడం, భారత అభివృద్ధికి కృషి చేసిన ప్రవాసీలను సన్మానించడం లాంటి అంశాలను చర్చించే వేదికగా ప్రవాసీ భారతీయుల దినోత్సవం ఉపయోగపడుతోంది. ప్రవాసీ భారతీయ దివస్‌ నేపథ్యంలో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ వికసిత్‌ భారత్(Viksit Bharat) సాధనలో ప్రవాసీ భారతీయుల పాత్ర పేరుతో‌ ప్రత్యేక సదస్సును నిర్వహించడం కూడా కొనసాగుతోంది.

వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి ఊతం..

- Advertisement -

ప్రవాసీ భారతీయులతోపాటు భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు(పర్సన్స్ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్-పీఐఓ‌) కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి చేయూతనివ్వడం నిరంతరం కొనసాగాలని ప్రభుత్వం, పౌర సమాజం కోరుకుంటోంది. సంస్కృతులు, వాణిజ్యం, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, సృజన మెండుగా ఉన్న దేశభక్తి కలిగిన ప్రవాసీ భారతీయులు 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు దోహదపడాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలను ప్రోత్సహిస్తూ రెడ్‌ కార్పెట్‌ ఆహ్వానం పలుకుతోంది. 2024 వివరాల ప్రకారం.. 15 మిలియన్ల ప్రవాసీ భారతీయులు, మరో 20 మిలియన్ల భారత మూలాలు కలిగిన పీఐఓలు పలు అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అత్యధిక ప్రవాసీ భారతీయులు కలిగిన దేశంగా అమెరికా ప్రసిద్ధిగాంచింది. అమెరికాలో 44.6 లక్షలు, యూఏఈలో 35 లక్షలు, మలేసియాలో 29.14 లక్షలు, కెనడాలో 28.76 లక్షలు, సౌదీ అరేబియాలో 24.64 లక్షల మంది ప్రవాసీ భారతీయులు ఉన్నారని తెలుస్తోంది.

మేధో వలసకు పర్యాయపదంగా..

మేధో వలస లేదా బ్రెయిన్‌ డ్రెయిన్‌ అనబడే పదాన్ని తొలిసారి యూకేలో 1960లో ఉపయోగించారు. నైపుణ్యం, ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన యువత ఉన్నత భవిత కోసం తమ దేశాన్ని వదిలి అభివృద్ధి చెందిన దేశాలకు వలసపోవడాన్ని మేధో వలస లేదా హూమన్‌ క్యాపిటల్‌ ఫ్లైట్‌ అంటారు. అభివృద్ధి చెందుతున్న యువభారతం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగావకాశాలు, ఉన్నత ప్రమాణాలు గల యూనివర్సిటీల్లో విద్యా బోధనలు, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు అవకాశాలు, ఉత్తమ జీవనశైలి, సులభ వీసా విధానాలు, రూపాయి విలువ పతనం, రాజకీయ స్థిరత్వం లాంటి కారణాలతో లక్షల సంఖ్యలో ఏటా అభివృద్ధి చెందిన దేశాలకు వలసపోవడం, అక్కడే స్థిరపడి ప్రవాసీ భారతీయులుగా మారడం జరుగుతోంది.

ఉన్నత విద్య కోసం మాత్రమే కాకుండా నైపుణ్యం, సృజనశీల మేధస్సు గల వ్యక్తులు కూడా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడటం కూడా కొనసాగుతున్నాయి. భారత్‌లో విద్యా ప్రమాణాలు తగ్గడం, పరిశోధనాలయాల కొరత, నిరుద్యోగం, వేతన వ్యత్యాసాలు, రాజకీయ అస్థిరత్వం, జీవనశైలి ప్రమాణాలు తగ్గడం, ఆర్థికావకాశాలు మూతపడటం లాంటి కారణాలు కూడా యువత విదేశీ పయనాలకు దారితీస్తున్నాయి. అమెరికాలో 12 శాతం శాస్త్రవేత్తలు, 38 శాతం వైద్యులు, 36 శాతం నాసా ఉద్యోగులు ప్రవాసీ భారతీయులే అని తెలిసి ఆశ్చర్యపోతున్నాం. అంతే కాకుండా మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల్లో 34 శాతం, ఐబీఎంలో 28 శాతం, ఇంటెల్‌లో 17 శాతం, గూగుల్‌లో 12 శాతం ఉద్యోగులు ప్రవాసీ భారతీయులే అని తెలుసుకోవాలి.

మేధో వలసలో ప్రథమ స్థానం ఇండియాదే. 2022లో 7.7 లక్షల యువత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. 2024లో దాదాపు 1.8 మిలియన్ల మంది భారతీయ యువత చదువుల నిమిత్తం విమానయానం చేశారని గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి నేటి వరకు 23 వేల మంది మిలియనీర్లు ఇండియాను వదిలి విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. మేధో వలసను తగ్గించడానికి మన యూనివర్సిటీ విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయి వరకు పెంచడం, తిరిగొచ్చే ప్రవాసీ భారతీయులకు పన్ను రాయితీలను ఇవ్వడం, పేటెంట్‌ పొందే వారికి పన్నులు తగ్గించడం లాంటివి కల్పించాలని సూచిస్తున్నారు.

మేధో వలస వరమా, శాపమా!

మన దేశ అమూల్య వనరు అయిన మేధావులు, నైపుణ్యం కలిగిన టెక్నోక్రాట్లు, ప్రొఫెషనల్స్‌.. దేశాన్ని వదిలివెళ్లడం జన్మభూమికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. అదే విధంగా.. నిరంతరం మేధో వలస కొనసాగితే దేశ సామాజిక ఆర్థిక సమగ్రాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని తెలుసుకోవాలి. మేధో వలస వల్ల స్వదేశంలో ఇన్నోవేషన్‌, పరిశోధనలు, సుస్థిరాభివృద్ధి కుంటుపడుతుంది. మేధో వలస వల్ల దేశానికి కొంత వరకు ఆర్థిక చేయూత లభిస్తుండటం కొంత వరకు ఊరటనిస్తోంది. ఒక మొక్కను నాటి, సకల పరిచర్యలు చేసి, నీరు పోసి, ఎరువు వేసి పెంచిన తర్వాత పండ్లు లభించే స్థాయిలో దాన్ని మరొకరికి ఇవ్వడం ఎంత బాధ కలిగిస్తుందో అంతే నష్టాన్ని మేధో వలస కూడా జన్మభూమికి చేస్తుందని తెలుసుకోవాలి.

మేధో వలస వల్ల అభివృద్ధి చెందిన దేశాలకు పెట్టుబడి పెట్టకుండానే ‘రెడీ టు యూజ్‌ స్కిల్డ్‌ యూత్‌’ ఉచితంగా లభిస్తోంది. నేటి ప్రవాసీ భారతీయ దినం మన దేశానికి, ప్రవాసీ భారతీయులకు మధ్య వారధిగా నిలవాలని, ప్రవాసీ పౌర సమాజం తిరిగి తమ దేశంలో మేధోపరమైన, ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టి భారతావనిని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చడానికి తమ వంతు కృషి చేయాలని కోరుకుందాం. మన ప్రవాసీలను ప్రేమతో ఆలింగనం చేసుకుందాం.

(జనవరి 9న ప్రవాసీ భారతీయుల దినోత్సవం లేదా ఎన్ఆర్ఐ డే సందర్భంగా)

  • ఆచార్య బుర్ర మధుసూదన్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES

Latest News