Thursday, March 5, 2026
Homeనల్లగొండTension | అర్ధరాత్రి రావులపల్లిలో ఉద్రిక్తత

Tension | అర్ధరాత్రి రావులపల్లిలో ఉద్రిక్తత

  • గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్‌.
  • అర్ధరాత్రి మృతదేహం తరలింపుతో ఘర్షణ.
  • కానిస్టేబుల్‌కు గాయాలు, పోలీస్‌ వాహనాల ధ్వంసం.
  • న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యుల ఆందోళన.
  • గ్రామంలో భారీగా పోలీస్‌ల మోహరింపు.
  • మంగళవారం సాయంత్రం లాజరస్‌కు అంత్యక్రియలు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో రైతు మృతితో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి వివాదానికి సంబంధించి పోలీసుల విచారణ జరుగుతుండగా రైతు జోగునూరి లాజరస్‌ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో గ్రామంలో ఆందోళన మొదలై, మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని సౌజన్య రెడ్డి కూతురు ఇల్లు నిర్మాణం జరుగుతున్న దగ్గర వేసి నిరసనకు దిగారు.

అర్ధరాత్రి 12 గంటలకు ఉద్రిక్తత :

సోమవారం అర్ధరాత్రి లాజరస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్‌కు చేశారు.ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తుంది. కారంపొడి చల్లి, నిప్పురవ్వలు విసిరినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయని, రెండు జీపులు, ఒక డీఎస్పీ వాహనం ధ్వంసమయ్యాయి. అనంతరం భారీ బందోబస్తు మధ్య లాజరస్‌ మృతదేహాన్ని అర్ధరాత్రే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిరది.

- Advertisement -

కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు :

మంగళవారం ఉదయం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లాజరస్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు మధ్య మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. రావులపల్లి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తుంగతుర్తి సర్కిల్‌ పరిధిలోని పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం లాజరస్‌ కు రావులపల్లిలో కుటుంబ సభ్యులు అంతక్రియలు నిర్వహించారు.

సోమవారం రాత్రి జరిగిన ఘటనల నేపథ్యంలో లాజరస్‌ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు సౌజన్య రెడ్డి వర్గానికి చెందిన పది మందిపై కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు భూమి వివాదం నేపథ్యం :లాజరస్‌ 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. అయితే ఇటీవల రైతుకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే 2 ఎకరాలు 20 గుంటల భూమికి పట్టా జారీ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల తుంగతుర్తి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా కూడా నిర్వహించారు.

పోలీసుల వివరణ :

ఈ ఘటనపై తుంగతుర్తి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. లాజరస్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సౌజన్య రెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రాత్రి జరిగిన దాడిలో పోలీస్‌ వాహనాలు ధ్వంసమయ్యాయని, ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ ఫిర్యాదు అందిన తర్వాత మరిన్ని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.రైతు మృతి, భూమి వివాదంపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని లాజరస్‌ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News