Thursday, February 12, 2026
Homeసాహిత్యంGnanananda Kavi | తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ

Gnanananda Kavi | తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ

తెలుగు పద్య కవుల్లో(Telugu Poetry) జ్ఞానానంద కవి స్థానం విశిష్టమైంది. తెలుగు పద్యానికి వన్నె తెచ్చిన గొప్ప కవి ఆయన. పూర్తి పేరు.. సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. 1922 జూలై 16న విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు. 6వ ఏటే రచనలు ప్రారంభించారు. భీమునిపట్నం బోర్డింగ్‌ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదువుకున్న తరవాత కాకినాడలో ఉపాధ్యాయ శిక్షణ(Teacher Training) పొందారు. అనంతరం 14వ ఏటే అప్పటి విశాఖ జిల్లా అలజంగి గ్రామంలో తెలుగు పండితుడిగా ఉపాధ్యా య వృత్తిలో చేరారు. 1982లో పదవీ విరమణ చేశారు.

వసంతగానం(1947), గాంధీ(1950), దేశబంధు, పాంచ జన్యం(1956), ప్రభంజనం, పర్జన్యం(తొలి భాగం) (1959), గోల్కొండ, క్రీస్తు చరిత్ర(1963), విజయాభిషేకం(1966), పర్జన్యం(రెండో భాగం)(1969), అక్షరాభిషేకం(1971), ఆమ్రపాలి(1972), అక్షరాక్షతలు(1973), అక్షర గుచ్చం(1975), వెలుగు బాట (1976), క్రీస్తు ప్రబంధం(1977), క్రీస్తు ప్రబంధం తొలి భాగం(1992), నా జీవిత గాథ తొలిభాగం(1977), అక్షర పూజ(1979), హరిజనులు అంటరానివారా (1980), పిల్లన గ్రోవి(1982), రాజధాని(1987), వంశ ధార(1989), ది విజన్‌ ఇన్‌ ది వర్సస్‌ ఆఫ్‌ డాక్టర్‌ జ్ఞానంద కవి(1990), కూలీ నుంచి కళాప్రపూర్ణ వరకు (1988), ధర్మాగ్రహం(1998), వివేకానంద గానం(2004), రెండు వేల పద్యాలతో క్రీస్తు ప్రబంధం, మన దేశం, రోజలు మారాలి(లఘు నాటిక) బాష్ప సందేశం, పిల్లన గ్రోవి, రాజధాని, ఆహ్వానం, రెండంకితాలు, ఆరు దశాబ్ధాల కవితా పరిశ్రమ, అభినందన పద్యగద్య వ్యాస సంపుటితోపాటు జ్ఞానంద కవి చేసిన పలు రచనలు విశేష ప్రాచుర్యం పొందాయి.

- Advertisement -

విజయవాడలో 1950 మే 20న కవికోకిల, కాకినాడలో 1961 ఏప్రిల్‌ 24న కవిలోక విభూషణ, 1968 నవంబర్‌ 10న విద్వత్‌ కవి చూడామణి, 1968 నవంబర్‌ 15న సాహితీ వల్లభ, 1974 జనవరి 27న మహాకవి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1974 ఆగస్టు 3న కళాప్రపూర్ణ, విజయవాడలో 1974 సెప్టెంబర్‌ 29న అభినవ జాషువ, బొబ్బిలి చిలుకలపల్లిలో 1975 సెప్టెంబర్‌ 28న సాహితీ కృషీవల, 1979 అక్టోబర్‌ 28న కవి సార్వభౌమ, విశాఖ, రామచంద్రాపురంలో 1982 సెప్టెంబర్‌ 28న కవితా శ్రీనాథ, 1982లో పద్య విద్యా ప్రభు, విజయనగరం జిల్లాలో 1987 డిశంబర్‌ 7న కవితా విశారద, 1988లో నాటి సీఎం ఎన్‌టీఆర్ చేతుల మీదుగా కవి సార్వభౌమ బిరుదు పొందారు. 1991లో భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు(Padmasri Award), 1991 ఫిబ్రవరి 7న బ్రహ్మీవిభూషణ, 1996లో డి.లిట్‌ స్వీకరించారు. ఆయన రచనలు, జీవితంపై 5 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. పలు వర్సిటీల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

జ్ఞానానంద కవి.. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం(Andhra Pradesh Official Language Commission), ఆంధ్రప్రదేశ్‌ లైబ్రరీ యాక్ట్‌ రివ్యూ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ అకాడమీ, ఆంధ్ర విశ్వవిద్యాలయ అకాడమీ కౌన్సిల్‌, తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్‌ సంఘం, తూర్పు గోదావరి జిల్లా గ్రంథలాయ సంస్థ సభ్యుడిగా పలు పదవులు నిర్వహించారు. సాహితీ సంస్థలను ఏర్పాటుచేయడంపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. 1967లో సాహితీ సమాఖ్య, 1972లో సాహి త్య కళాపీఠం, 1980లో జాషువా కవి సాహిత్య పీఠాల్ని ఏర్పాటుచేశారు.

కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, బెజవాడ గోపాల్‌ రెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, అయ్యదేవర కాళేశ్వర రావు, డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, దేవులపల్లి రామానుజరావు, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్య, డాక్టర్‌ కొలుకలూరి ఇనాక్‌, ఆర్ఎస్‌ సుదర్శనంతోపాటు నాటి సీఎం ఎన్టీ రామారావు(NT RamaRao) ప్రత్యేకంగా అభినందించినవారిలో ఉన్నారు. దివంగత రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ నుంచి 2000 సంవత్సరంలో అత్యున్నత పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. 2011 జనవరి 6న లోకాన్ని వదిలి వెళ్లారు.

(జనవరి 6న జ్ఞానానంద కవి వర్ధంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News