Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంRetirement | ఉద్యోగికి విశ్రాంతి కాలం.. ‘‘విషాద కాలం’’గా మారుతోంది!

Retirement | ఉద్యోగికి విశ్రాంతి కాలం.. ‘‘విషాద కాలం’’గా మారుతోంది!

  • సేవకు సలాం లేదు… వృద్ధాప్యానికి విలువా లేదు!
  • ప్రభుత్వానికి వెన్నెముకలా నిలిచిన ఉద్యోగుల చరమాంకం నేడు ప్రశ్నార్థకం?
  • నిజాయితీకి నిలువునా ద్రోహం.. విశ్రాంత ఉద్యోగుల కన్నీటి వెతలు..
  • రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అనేవి ప్రభుత్వం వేసే భిక్ష కాదు, అది వారి హక్కు..

ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగాలంటే దానికి మూలస్తంభం ‘ఉద్యోగి’. అందులోనూ అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ, సమయపాలన పాటిస్తూ, ప్రజల పనే పరమావధిగా భావించి పనిచేసే నిజాయితీ గల ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయ లాంటివారు. కానీ, దురదృష్టవశాత్తు నేటి ప్రభుత్వాలు ఆ గుండె చప్పుడు ఆగిపోయేలా చేస్తున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన యవ్వనాన్ని, శక్తిని, కాలాన్ని ప్రభుత్వం కోసం, ప్రజల కోసం వెచ్చిస్తాడు. ఎన్నో ఒత్తిళ్ళ మధ్య, రాజకీయ నాయకుల జోక్యాల మధ్య కూడా తలవంచక నిలబడి పనిచేసిన నిజాయితీపరుల సేవలు వెలకట్టలేనివి.

‘‘రిటైర్మెంట్‌ తర్వాత ప్రశాంతంగా బతుకుతాం’’ అనే ఒకే ఒక్క ఆశతో వారు దశాబ్దాల పాటు రాజీలేని పోరాటం చేస్తారు. రిటైర్మెంట్‌ అనేది ఒక ఉద్యోగికి విశ్రాంతి కాలం కావాలి, కానీ నేడు అది ‘‘విషాద కాలం’’గా మారుతోంది. ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకుంటాడు . ఆ డబ్బును కూడా సమయానికి ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవడం అంటే, నమ్మిన వారి గొంతు కోయడమే. ఇది ముమ్మాటికీ పాపమే. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక, సొంత డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి రావడం ఒక వృద్ధుడిని క్షోభకు గురిచేయడమే. వారి కన్నీరు ప్రభుత్వానికి శాపం కాక మరేమిటి? ఇప్పటికైనా ప్రభుత్వమా మేలుకో… ఈ కన్నీటి గాధ విను…

- Advertisement -

ప్రభుత్వం అంటే కేవలం నాయకులు మాత్రమే కాదు, ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య వారధిగా నిలిచే ‘‘ప్రభుత్వ ఉద్యోగి’’. సంక్షేమ పథకమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేర్చేది వీరే. యవ్వనమంతా ప్రభుత్వ సేవలో కరిగించి, రేయింబవళ్లు శ్రమించిన ఆ ఉద్యోగుల బతుకులు నేడు అగమ్యగోచరంగా మారాయి. ముప్పై, నలభై ఏళ్ల పాటు ప్రభుత్వమే తన కుటుంబం అనుకుని బాధ్యతగా పనిచేసిన ఉద్యోగి, పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా గడపాలని ఆశించడం సహజం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఆ ఆశల విూద నీళ్లు చల్లుతున్నాయి. విశ్రాంత జీవితంలో ఆసరాగా నిలుస్తాయనుకున్న ‘‘రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌’’ అందక ఎందరో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. తమ జీవితకాలంలో దాచుకున్న జీపీఎఫ్‌, రావాల్సిన గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌ వంటి ప్రయోజనాల కోసం చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఉద్యోగులకు రావలసిన ప్రయోజనాలు పొందాలంటే పర్సంటేజీల వారీగా ముడుపులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరం.

‘‘నిజాయితీగా బ్రతకడమే మేము చేసిన నేరమా?’’

అని వృద్ధ ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘‘పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణాలు, ఆసుపత్రి ఖర్చులు… అన్నీ రిటైర్‌మెంట్‌ డబ్బులపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేతులెత్తేస్తే మా పరిస్థితి ఏంటి?’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవినీతిని అంతం చేయండి ` ఉద్యోగి పొట్ట కొట్టకండి

వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు, అవినీతి ఉండవచ్చు. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, ఆ నెపంతో లేదా ఆర్థిక ఇబ్బందుల పేరుతో నిజాయితీగా పనిచేసిన ఉద్యోగుల హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డ్‌ ఉద్యోగుల కడుపు కొట్టి సాధించే అభివృద్ధి ఎవరి కోసం?

ప్రకృతి తీర్పు కఠినంగా ఉంటుంది!

వయోభారంతో కుంగిపోతున్న వృద్ధుల కన్నీరు ప్రభుత్వానికి, సమాజానికి మంచిది కాదు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే… కాలం మరియు ప్రకృతి ఇచ్చే తీర్పు చాలా కఠినంగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆ తీర్పు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని గుర్తుచేస్తున్నారు.

ఇకనైనా కళ్ళు తెరవండి గౌరవప్రదమైన వీడ్కోలు అందుకోవాల్సిన సమయంలో ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం తగదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండిరగ్‌లో ఉన్న రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ వెంటనే విడుదల చేయాలి. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను త్వరితగతిన చెల్లించి, విశ్రాంత ఉద్యోగుల గౌరవాన్ని కాపాడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News