పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జిల్లా టాస్క్ఫోర్స్ బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 1,33,000/- (లక్షా ముప్పై మూడు వేల రూపాయలు) విలువ గల మద్యాన్ని, దాన్ని తరలిస్తున్న ఒక కారును (Tata Curv) సీజ్ చేశారు.
బోయినపల్లి మండలం లోని స్థంభంపల్లి గ్రామానికి చెందిన సంతోష్, సుమన్.లు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణ పరిధిలోని నంది కామాన్ వద్ద ఉన్న వైన్స్ నుండి మద్యాన్ని కొనుగోలు చేసి, స్థంభంపల్లి గ్రామానికి తరలిస్తున్నారనే పక్కా సమాచారం జిల్లా టాస్క్ఫోర్స్ బృందానికి అందింది. వెంటనే దాడులు నిర్వహించిన పోలీసులు, నిందితుల వద్ద 253 లీటర్ల అక్రమ మద్యాన్ని, దానిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన వాటి మొత్తం విలువ 1,33,000/-గా పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా బోయినపల్లి ఎస్.ఐ. రమాకాంత్ మాట్లాడుతూ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్రమంగా మద్యం, డబ్బు రవాణాకు పాల్పడినందుకు నిందితులపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. “సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, డబ్బు రవాణాకు పాల్పడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవు,” అని ఎస్.ఐ. రమాకాంత్ ఈ సందర్భంగా హెచ్చరించారు
