అంతర్జాతీయ సినిమా ఉత్సవాలపై ఎఫ్డీసీ ఎండీ విశ్వనాథన్‌కి మంత్రి కందుల దుర్గేష్ సూచన
అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో (International film festivals) తెలుగు సినిమా జెండా ఎగరవేద్దామని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh).. ఎఫ్డీసీ ఎండీ (FDC MD) కె.ఎస్.విశ్వనాథన్‌కు సూచించారు. గురువారం.. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను ఆయన వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవంబర్ 20 నుంచి 28 వరకు నిర్వహించిన గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించిన రాష్ట్ర శకటానికి వచ్చిన ప్రథమ బహుమతి(First Prize)ని మంత్రి దుర్గేష్‌కు చూపించారు. ఎఫ్డీసీ నుంచి మొట్టమొదటిసారిగా హార్ట్ బీట్ ఆఫ్ ఇండియన్ సినిమా (Heartbeat of Indian Cinema) ఇతివృత్తంతో ప్రత్యేక శకటం 20 మంది డూప్ లైవ్ నటీనటులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చిత్రోత్సవాల్లో కనువిందు చేసిందని వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ(Film Development Corporation) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలపై చర్చించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికపై మాట్లాడారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఇకపై ఏటా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ ఎఫ్డీసీ ఎండీ కె.ఎస్. విశ్వనాథన్‌కు సూచించారు. ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కళాకారులకు అందించే కందుకూరి ప్రతిష్టాత్మక, విశిష్ట అవార్డుల అంశం చర్చకు రాగా వచ్చే ఏడాది సంబంధిత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
