- శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా
- వారం రోజులుగా లంకలో కుంభవృష్టి
- తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో హై అలర్ట్
- డిసెంబర్ 3 వరకు మోస్తరు వానలు
- లంకలో అత్యవసర పరిస్థితి ప్రకటన
- తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక చిగురుటాకులా వణికింది. ఈ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 123 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వరదల వల్ల ఏర్పడిన విధ్వంసం కారణంగా తలెత్తిన అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే దేశమమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం శ్రీలంకను దాటిన దిత్వా తుఫాను 123 మందికి పైగా ప్రాణాలను బలిగొందని, విధ్వంసం, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని ఆ దేశ అధికారులు తెలిపారు. ‘దిత్వా శ్రీలంక నుండి భారత తీరం వైపు వెళ్లింది.
ఈ క్రమంలో భారీ వర్షం, అధిక వేగంతో కూడిన గాలులు వీశాయి. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎంతో మంది జీవనం అస్తవ్యస్తంగా మారింది’ అని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల కరుణనాయకే మీడియాతో తెలిపారు. ఇదే సమయంలో విపత్తు నిర్వహణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో పలు విషయాలను వెల్లడించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయనియని తెలిపింది. 43వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీఎంసీ జనరల్ డైరెక్టర్ సంపత్ తెలిపారు. పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నా యన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. వందలమందిని తాత్కాలిక పునరావాసాలకు తరలించామని డీఎంసీ జనరల్ డైరెక్టర్ వెల్లడించారు.
