- కేంద్రం దెబ్బతో దిగివచ్చిన మావోలు
- ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలి
- కూంబింగ్ చర్యలు ఆపాలని షరతులు
- భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపిన మావోలు
- ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల సీఎంలకు అనంత్ పేరిట బహిరంగ లేఖ
వరుస ఎనకౌంటర్లు, లొంగుబాట్లు, ఆపరేషన్ కగార్ల నేపథ్యంలో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజానికి 90శాతం దెబ్బతినట్లుగానే భావించాలి. ఈ క్రమంలో ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ మూడు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది. దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేం సమర్థిస్తున్నాం.
కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. అయితే మూడు రాష్ట్రల ప్రభుత్వాలు మాకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మా పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు మాకు కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి పద్దతి ప్రకారం వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు సమయం కావాలి. ఇంత సమయం అడిగేందుకు ఇతర ఉద్దేశాలేమీ లేవు.
త్వరగా కమ్యూనికేట్ చేసేందుకు మాకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నాం. భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలి. పీఎల్ జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోం. మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నాంఅని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది.
ఇప్పటికే బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని లేఖలో పేర్కొంది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రాల్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతాదళాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ఈ మేరకు లేఖను విడుదల చేసింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ చెప్పింది. దీంతో ఈ లేఖపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయో చూడాల్సి ఉంది.
