తెలంగాణవ్యాప్తంగా రోడ్ సేప్టీ అవగాహన కార్యక్రమాలు
డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి
ఎల్బీ స్టేడియంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 14 (ఆదాబ్ హైదరాబాద్): రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారక మంత్రమని డీజీపీ (DGP) బి.శివధర్ రెడ్డి చెప్పారు. పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలకు చెక్ (Check) పెట్టొచ్చని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం(Lb Stadium)లో శుక్రవారం రోడ్ సేప్టీ అవగాహన కల్పించేందుకు తలపెట్టిన అరైవ్ అలైవ్ (Arrive Alive) కార్యక్రమాన్ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(Sajjanar)తో కలిసి డీజీపీ బి.శివధర్ రెడ్డి ప్రారంభించారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమ పోస్టర్‌ను సినీ ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏటా 800 మంది హత్యలకు గురవుతుంటే అంతకు పదింతలు (8 వేల మంది) రోడ్డు ప్రమాదాల వల్ల దుర్మరణం చెందుతున్నారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలనేవి చాలా తీవ్రమైన సమస్య అని, ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. రోడ్ సేప్టీ(Road Safety)పై అవగాహన కల్పిస్తూ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
