స్వదేశీ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో కేంద్రమంత్రులు సిద్దం అవుతున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా ’జోహో(Zoho)’ ప్లాట్‌ఫామ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇప్పటికే కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవలను గూగుల్‌కు చెందిన జీమెయిల్ నుంచి స్వదేశీ సంస్థ అయిన ‘జోహో మెయిల్’కు మార్చుకున్నారు. ఈ మార్పును ఆయన స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. “అందరికీ నమస్కారం, నేను జోహో మెయిల్‌కు మారాను. దయచేసి నా ఈమెయిల్ అడ్రస్‌లో మార్పును గమనించగలరు.
నా కొత్త ఈమెయిల్ చిరునామా: [email protected]. భవిష్యత్తులో నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు ఈ చిరునామాను ఉపయోగించగలరు” అని తన పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఇకనుంచి మెయిల్స్ అన్నీ ఈ కొత్త అడ్రస్‌కే పంపాలని చెప్పారు. జీమెయిల్, మైక్రోసాప్ట్ ఔట్‌లుక్‌కు పోటీగా జోహో మెయిల్‌ను తీసుకువచ్చారు.
మైక్రోసాప్ట్ పవర్‌పాయింట్ బదులు జోహోతోనే కేబినెట్ ప్రంజెంటేషన్ తయారు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. జోహో రూపొందిన మెసేజింగ్ యాప్ ’అర్టటై’ని వాడాలంటూ ధర్మేంద్ర ప్రదాన్ ఇంతకుముందు పిలుపునిచ్చారు. ప్రస్తుతం అర్టటైకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ యాప్‌ను విపరీతంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
యూజర్ల ప్రైవసీ కోసం త్వరలోనే ’అర్టటై’లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌పై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐసీ (NIC) ద్వారా ప్రత్యేక సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ సర్క్యులర్‌లో తెలిపారు. ఇందులో సమాచార గోప్యతపై పెద్దఎత్తున చర్చ జరుగుతోన్న సమయంలో ఈ స్పందన వచ్చింది.