సుప్రీంకోర్టులో సోమవారం నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ బి.ఆర్. గవాయి ఎదుట ఒక లాయర్ హల్ చల్ చేశాడు. ఆ లాయర్ ఏకంగా సిజెఐ బీఆర్ గవాయ్ ఎదుట షూ తీసి దాడి చేయాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది ఆ లాయర్‌ను బయటకు పంపడానికి ప్రయత్నించగా, బయటకు వెళ్తూ ‘సనాతన్ కా అపమాన్ నహీ సహేగా హిందుస్థాన్’ (సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని హిందుస్థాన్ సహించదు) అనే నినాదం కూడా ఇచ్చారు. ఈ సంఘటన సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన తర్వాత సీజేఐ బీఆర్ గవాయ్ కోర్టులో ఉన్న న్యాయవాదులను వాదనలు కొనసాగించాలని కోరారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహో ప్రాంతంలో శిరస్సు లేని విషు దేవుడి విగ్రహం మరమ్మతులు చేయాలని దాఖలైన పిటిషన్ పట్ల విచారణ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని పలువురు న్యాయవాదుల ఆరోపించారు. “వెళ్లి దేవుడినే అడగండి..అది ఆర్కియాలజీ విభాగానికి సంబంధించిన విషయం..వాళ్లు అనుమతి ఇవ్వాల్సిందే” అని బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఆ కోపంతోనే ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం ఇలాంటి విషయాలతో తాను ఏమాత్రం ప్రభావితం కానని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.