- ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్, చంద్రబాబు తదితరులు
- ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న రాధాకృష్ణన్
- పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్‌కు హాజరు
- ఆంద్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ అంటూ కితాబు
తొలిసారి విజయవాడకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఎండోమెంట్ కమిషనర్ సీహెచ్ రామచంద్ర మోహన్, మంత్రి పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్, బోర్ర గాంధీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను, మీడియా మిత్రులను కలిసి వైస్ ప్రెసిడెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు. తరువాత అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆలయ ఈవో అందజేశారు. తరవాత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.









ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. విజయవాడ హాట్ సిటీ.. కూల్ పీపుల్. ఇది అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా మారాలి. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వికసిత్ ఆంధప్రదేశ్ దిశగా దూసుకెళ్తోంది. ఈ పర్యటనను నా జీవితంలో మరిచిపోలేను. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి.. జై ఆంధప్రదేశ్‘ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
అంతకుముందు విజయవాడ పర్యటన నిమిత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి దుర్గమ్మ సన్నిధికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి దుర్గమ్మ దర్శనం నేపథ్యంలో ఆలయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలు నిలుపుదల చేశారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 6 గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు తమకి సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.
