Tuesday, October 28, 2025
ePaper
HomeతెలంగాణHarish rao| సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం... హరీష్ రావు ఆరోపణలు

Harish rao| సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… హరీష్ రావు ఆరోపణలు

మాజీ మంత్రి, సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దసరా పండుగ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ బోనస్ ప్రకటించి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాభాల్లో కొంత భాగాన్నే లెక్కల్లో చూపించి తక్కువ బోనస్ ఇచ్చి ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన అన్నారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లాభాల వాటా బోనస్‌పై స్పందించిన హరీశ్ రావు, 2024-25లో కంపెనీకి రూ. 6,394 కోట్ల లాభం వచ్చిందని, అయితే బోనస్ పంపిణీకి కేవలం రూ. 2,360 కోట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని ఎత్తిచూపారు. ఈ మొత్తంలో 34 శాతం మాత్రమే ఉద్యోగులకు కేటాయించారని అన్నారు. దీనివల్ల కార్మికులకు దక్కాల్సిన వాటా సగానికి తగ్గిపోయింది అని అన్నారు. దసరాకు తీపి కబురు కోసం ఎదురు చూస్తుంటే..చేదు వార్త వినాల్సి వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు.

సింగరేణి కార్మికులను కాంగ్రెస్ మోసం చేయడం కొత్తేమీ కాదని మాజీ మంత్రి అన్నారు. “గతేడాది కూడా పంపిణీ చేయాల్సిన నిధులను తగ్గించి, 50 శాతం కోత విధించి కార్మికులను మోసం చేసింది కాంగ్రెస్. ఇప్పుడు రూ. 4,034 కోట్లను భవిష్యత్ విస్తరణ పేరుతో పక్కన పెట్టారు. కార్మికుల డబ్బుతో ఎవరి జేబులు నింపుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్న SCCLను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ధరించారని గుర్తు చేశారు. 2014-15లో 21 శాతం ఉన్న ఉద్యోగుల లాభాల వాటాను 2022-23 నాటికి 32 శాతానికి పెంచారని అన్నారు. “1998 నుంచి 2011 వరకు కార్మికులకు కేవలం 16 శాతం వాటా మాత్రమే లభించింది. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను గుర్తించి, వారి వాటాను కేసీఆర్ పెంచడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని మళ్లీ మొదలుపెడుతున్నారు” అని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ తరపున ఆయన డిమాండ్ చేస్తూ, విస్తరణ బడ్జెట్ పేరుతో తగ్గించిన లాభానికి బదులుగా, సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు వాగ్దానం చేసిన 34 శాతం లాభాన్ని బోనస్‌గా SCCL ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మోసం ఇలాగే కొనసాగితే, కార్మికుల తరపున బీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News