హిమాచల్, ఉత్తరాఖండ్‌లపై వాతావరణ శాఖ అంచనా
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తాజాగా కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అయితే, ఈ అనూహ్య వర్షాలకు గాలుల విధ్వంసమే కారణమని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. పొడి పశ్చిమ గాలులు, తేమతో కూడిన తూర్పు గాలుల పరస్పర చర్య వల్లే భారీ వర్షాలు కురిశాయన్నారు. వీటి ప్రభావం మరో 24గంటలు ఉండవచ్చని అంచనా వేశారు. డెహ్రాడూన్ లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలువురు గల్లంతు కావడంతోపాటు దాదాపు 500 మంది చిక్కుకుపోయారు. హిమాచల్‌లోని మండీలో కొండచరియలు విరిగిపడి, వరదల్లో ఓ బస్సు కూడా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు.
పశ్చిమ తేమ గాలులు, తూర్పు తడి గాలుల పరస్పర చర్య వల్లే భారీ వర్షాలు కురిశాయని డెహ్రాడూన్‌లోని ప్రాంతీయ వాతావరణశాఖ అధిపతి సీఎస్ తోమర్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణ వ్యవస్థ లేదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ పేర్కొన్నారు. వెచ్చని, పొడి గాలుల భీకర చర్య వల్లే ఈ వర్షాలు వచ్చాయన్నారు. రాజస్థాన్ సమీపంలో తుపాను వ్యతిరేక, తేమతో కూడిన తూర్పు గాలుల కారణంగా ఇది సంభవించిందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్ 1343 మి.మీ (సాధారణం కంటే 22శాతం ఎక్కు), హిమాచల్‌లో 1010 మి.విూ (46శాతం ఎక్కు) వర్షపాతం రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్‌లో ఈ సీజన్‌లో 46 క్లౌడ్ బరస్ట్‌లు, 97 ఆకస్మిక వరదలు, 140 కొండచరియలు విరిగిపడిన ఘటనలు సంభవించాయని తెలిపారు.