రేవంత్ రెడ్డిని కలిసిన ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబం
వరంగల్ జిల్లా దామెర మండలం, పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం పట్ల రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 2, 2024న రాజస్థాన్ వెళ్తున్న రైలులో రాహుల్‌పై దుండగులు దాడి చేసి రైలు నుండి తోసివేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి రెండు కాళ్లను కోల్పోయారు. ఈ ఘటన అనంతరం సీఎం సహాయనిధి ద్వారా రాహుల్‌కు వైద్యం చేయించడంతో పాటు కృత్రిమ కాళ్లు అమర్చేలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వం అందించిన ఈ సహాయంతో మళ్లీ నడిచే స్థితికి చేరుకున్న రాహుల్, తాను తిరిగి జీవితాన్ని గెలవగలుగుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన చూపిన మానవత్వం ఎప్పటికీ మరిచిపోలేనిదని రాహుల్ భావోద్వేగంతో అన్నారు.