Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeజాతీయంఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌

  • తొలి ఓటు వేసిన ప్రధాని మోడీ
  • వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేసిన మాజీ ప్రధాని దేవేగౌడ

నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలోని వసుధ ఎఫ్‌ 101లో సందడిగా ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఆ వెంటనే ఆయన వరద బాధత రాష్టాల్రైన హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌కు బయలుదేరారు. అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు ఓటేశారు. పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ క్యూలో నిలబడి ఓటు వేయడం అందర్నీ ఆకట్టుకుంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేష్‌, శశిథరూర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వీల్‌చైర్‌పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కిరణ్‌ రిజిజు, చిరాగ్‌ పాశ్వాన్‌, కిషన్‌ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ హరివంశ్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌, ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ తదితర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వివిధ కారణాల రీత్యా ఓటింగ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు భారత్‌ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్‌, శిరోమణి అకాలీదళ్‌ ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌కు నలుగురు రాజ్యసభ ఎంపీలు, బీజేడీకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, శిరోమణి అకాలీదళ్‌కు ఒక ఎంపీ ఉన్నారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిలు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైకాపా, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది.

ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఎన్డీయే అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్‌ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్‌ విధానాన్ని అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్‌ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని విపక్ష అభ్యర్థి ప్రచారం చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికపై కాస్త ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -

Latest News