Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeకెరీర్ న్యూస్గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రక్రియలో జరిగిన మూల్యాంకనంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, మార్చి 10న విడుదలైన జనరల్ ర్యాంకింగ్ జాబితా, మార్కుల లిస్టును రద్దు చేస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్-1 సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, అది తప్పనిసరిగా సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారంనే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని గడువు కూడా విధించింది. గడువు లోపు పునఃమూల్యాంకనం జరగకపోతే, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.

గ్రూప్-1 మూల్యాంకనంలో తీవ్ర అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు, ఇప్పటికే ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉందని, నియామకాలను రద్దు చేయకూడదని మరికొందరు అభ్యర్థులు వాదనలు వినిపించారు. జూలై 7న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ రెండు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా వెలువడిన ఈ తీర్పుతో గ్రూప్-1 నియామక ప్రక్రియపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులంతా హైకోర్టు ఆదేశాల ప్రకారం పునఃమూల్యాంకనం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై దృష్టి సారించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News