- కరకంబాడి రోడ్డు సమీపంలో పట్టుబడిన 21ఎర్రచందనం దుంగలు
- మూడు కార్లు స్వాధీనం.. ఒక స్మగ్లర్ అరెస్టు
- కార్లలో లోడ్ చేస్తుండగా దాడి చేసిన టాస్క్ ఫోర్సు పోలీసులు
తిరుపతి కరకంబాడి రోడ్డులోని టీఎన్ పాళెం అటవీ ప్రాంతంలో మూడు కార్లలో లోడ్ చేస్తున్న ఎర్రచందనం చెట్ల వేర్లతో సహా 21దుంగలను పట్టుకుని, మూడు కార్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లరును అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఐపీఎస్ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, డీఎస్పీ ఎండీ షరీష్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ అధ్వర్యంలోని టీ. విష్ణుకుమార్ టీమ్ అటవీ సిబ్బంది చైతన్య, కిషోర్ లతో కలసి మామండూరు నుంచి కరకంబాడి మీదుగా కూంబింగ్ చేపట్టారు. వీరు కరకంబాడి రోడ్డులోని టీఎన్ పాలెం సమీపంలోని ఒక షాపింగ్ మాల్ వెనుక వైపుకు సోమవారం ఉదయానికి చేరుకున్నారు. అక్కడ కొందరు వ్యక్తులు మూడు కార్లలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా, వారు పారిపోసాగారు, అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. అతనిని చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పట్టుబడిన వాటిలో 19ఎర్రచందనం చెట్ల వేర్లు కాగా, రెండు దుంగలు ఉన్నాయి. మొత్తం 21ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, కార్లతో సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వ్యక్తిని డీఎస్పీ వీ.శ్రీనివాస్ రెడ్డి. ఎసీఎఫ్ జె.శ్రీనివాస్ విచారించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.