- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
- పట్టణంలోని సోమవార్ పేట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనందున, పట్టణంలోని సోమవార్ పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పలు పరీక్షా గదులను తిరుగుతూ, పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని చూశారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచీలు, లైటింగ్, త్రాగునీరు, తదితర మౌళిక సౌకర్యాలు కల్పించారో లేదో పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాసేలా పటిష్ట ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని, అన్ని పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ పరీక్ష కేంద్రం తనిఖీలో డిఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


