జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వల్లపు మహేష్ (23) అనే యువకుడు క్వారీ లో మునిగి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అరుంధతి నగర్‌కు చెందిన మహేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తన అమ్మమ్మ లింగమ్మ వద్ద నివసిస్తూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పని ఉన్నప్పుడు పెయింటింగ్ పనికి వెళ్లే మహేష్, పని లేనప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. ఆదివారం రోజు కావడంతో తన అమ్మమ్మకు ఈతకు వెళ్తున్నానని చెప్పి స్నేహితులతో కలిసి సమీప క్వారీకి వెళ్లాడు.

ఈత కొడుతున్న సమయంలో క్వారీ లో ఒక చిన్న బాల్ కనిపించడంతో దానిని తీసుకురావడానికి లోపలికి వెళ్లగా మహేష్ లోతులో చిక్కుకున్నాడు. అతని స్నేహితులు రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ అతను మరింత లోపలికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఆర్ఎఫ్ బృందం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మహేష్‌ను బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించగా అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేష్‌కు ఈత రాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతని అమ్మమ్మ లింగమ్మ తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
