- శ్యామ్ పిట్రోడా డైరెక్షన్ వల్లే ఈ సమస్య
- రాహుల్ తీరుపై మండిపడ్డ రామచంద్రరావు
- రేవంత్కు కిషన్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా
రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి విషయంలో కేంద్రపై నెపం వేస్తోందన్నారు. అధికారుల కొరతతో పాలనలో శూన్యత నెలకొంది. గ్రూప్ వన్ సమస్యతో సెలెక్ట్ అయినవారూ, కాలేని వారూ బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై రామ చందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామ చందర్ రావు మాట్లాడుతూ.. శ్యామ్ పిట్రోడా ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా రాహుల్ గాంధీ ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఓట్ల చోరీ ఏదీ లేదు. బోగస్ ఓట్లు మాత్రం ఉన్నాయి. బోగస్ ఓట్లు వేరు, ఓట్ల చోరీ వేరు.
ఈ తేడా కూడా తెలియని రాహుల్ గాంధీ ఒకసారి ఓట్ల చోరీ అంటారు, ఇంకోసారి హైడ్రోజన్ బాంబ్ అంటారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. ‘సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం రాసిన లెటర్ ఇప్పటికే సిబిఐ ముందుంది. రిపోర్ట్ ఆధారంగానే పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. అయితే ఆ విచారణలో నిందితులు ఎవరు అన్నది తేల్చారా? విచారణ తర్వాత రాజకీయ నాయకులను ఎవరినైనా అరెస్ట్ చేశారా?’ అని ప్రశ్నించారు. ‘టెర్రరిజం, లెఫ్ట్ టెర్రరిజం రెండూ ఒక్కటే. మావోయిస్ట్లతో చర్చలు అనేక సార్లు జరిగాయి. కానీ ఆ చర్చల వల్ల హింస తగ్గలేదు, పెరిగింది. హింస పెరగడం వల్లే ఆపరేషన్ కగార్ ముందుకు వచ్చింది. మావోయిస్ట్లతో చర్చలు జరపాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది’ అని స్పష్టం చేశారు.