రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కడ్తాల్ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 260 లో అసలు ఏమి జరుగుతుందని కడ్తాల్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 1954-55 ఖాస్త్ర పహాని ప్రకారం కడ్తాల్ గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 260 మొత్తము 2863.39 ఎకరాలు కలదు. ఇట్టి సర్వే నెంబర్ ను 1954-55 సంవత్సరంలో 260 సర్వే నంబరు 260/1, 260/2, 260/3, 260/4, 260/5, 260/6, 260/7, 260/8, 260/9 నెంబర్లతో 9 భాగాలుగా సబ్ డివిజన్ చేయడం జరిగింది. కాలక్రమేణ అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఒత్తిడిల మేరకు సర్వేనెంబర్ మొత్తంలో గందరగోళం నెలకొన్నది. సర్వే నెంబర్ మొత్తంలో ఉన్న భూమి 2863.39 ఎకరాల కంటే 3134.23 భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు అంటే సుమారుగా 270.23 ఎకరాల భూమికి అదనంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో సుమారు 18 వందల ఎకరాలు అటవీ ప్రాంతానికి ఉండగా దాదాపుగా 200 నుంచి 300 ఎకరాల భూదాన యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమి ఉండడం గమనార్హం.
కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అటు ఫారెస్ట్ భూమి, భూదాన యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమి అన్యాక్రాంతానికి గురైందని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని అప్పట్లో పలు విమర్శలు ఉత్పన్నమయ్యాయన్నారు. రెవెన్యూ అధికారులు, రియల్ దళారులు ఏకమై సంబంధం లేని వ్యక్తులకు కూడా రికార్డులతో సంబంధం లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం పలు అనుమానాలకు భావిస్తుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి, భూభారతి వంటి ఆధునిక పద్ధతులతో భూ రికార్డులను సరిచేస్తామని చెప్పి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వాల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. సంవత్సరాలు మారిన 260 సర్వే నెంబర్ కు మోక్షం ఎప్పుడో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అసలైన పట్టాదారుల భూమి వివరాలు నిషేధిత జాబితాలో చేర్చి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రియల్ దళారుల భూముల వివరాలు నిషేధిత జాబితా నుండి తొలగించిన రెవెన్యూ అధికారుల తీరు పట్ల సమగ్రమైన విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.