భయాందోళనలో స్థానికులు.. తొలగించాలని డిమాండ్..
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లి (Gundla Pochampalli) గ్రామానికి గత కొన్నేళ్లుగా తాగునీటి(Drinking Water)ని అందించిన వాటర్ ట్యాంక్ (Water Tank) శిథిలావస్థకు చేరింది. 14వ వార్డులోని ప్రాథమిక పాఠశాల(Primary School)కు దగ్గరలో ఉన్న ఈ వాటర్ ట్యాంక్‌ను నిర్మించి దాదాపు ఐదు దశాబ్దాలు కావొస్తోంది. ప్రస్తుతం ఆ వాటర్ ట్యాంక్ కింది భాగంలో పెచ్చులు ఊడిపోయి, ఇనుప చువ్వలు తేలి, ప్రమాదం (Danger) పొంచి ఉంది. కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ పైపెచ్చు ఊడిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు ఎవరిపై పెచ్చులు పడి ప్రమాదం జరుగుతుందోననే భయం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్‌ను తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యమని ఆగ్రహం వెలిబుచ్చుతున్నా. వాటర్ ట్యాంక్ పక్కన ఒకవైపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మరో వైపు నివాసగృహాలు ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతోందో తెలియకుండా ఉందన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే శిథిలావస్థలో ఉన్న నీటి ట్యాంక్‌ను తొలగించాలని కోరుతున్నారు.

