ఆ సినిమా ప్రేరణగా నిలుస్తుంది
పని మనిషి తన కూతురిని ఐఏఎస్ చదివిస్తుంది
పని మనిషి కూతురు పని మనిషి కాదని నిరూపించింది
కలలు కనండి.. కష్టపడండి.. వాటిని సహకారం చేసుకోండి
చిన్నప్పటి నుంచి మంచి సంస్కారం అలవర్చుకోవాలి
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టాలి
విద్యార్థులకు నిరంతరం పరీక్షలే
వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలి
చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
‘నీల్ బత్తె సన్నాట’ (Nil Battey Sannata) అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) పిలుపునిచ్చారు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. అందులో తల్లి పాత్రలో ఒక పని మనిషి (House Maid) ఉంటుందని, ఆమె కష్టపడుతూ తన కూతుర్ని ఐఏఎస్ (IAS) వరకు చదివిస్తుందని చెప్పారు. ‘సహజంగా డాక్టర్ కూతురు డాక్టరు, ఇంజనీరు కూతురు ఇంజనీరు అవుతుంటారు. కానీ.. పని మనిషి తన కూతుర్ని ఐఏఎస్ వరకు చదివించడం అద్భుతం. మన లక్ష్య సాధనకు ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుంది’ అని తెలిపారు.
శుక్రవారం కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్(Children’s Film Festival)కి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నీల్ బత్తె సన్నాట’ అనే హిందీ సినిమాను కేజీబీవీతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శిస్తున్నామని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సినిమాలో కూతుర్ని చదివించేందుకు ఒక తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చెప్పారు. చదువురాని తల్లి తన కూతురుతో పదో తరగతి వరకు చదువుతుందన్నారు. ఈ సినిమాను విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ చూడాలని కోరారు.
‘చిన్నారులు తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకోండి. కలలు కనండి. కష్టపడండి. వాటిని సహకారం చేసుకోండి. జీవితంలో ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలి’ అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి విద్యార్థులు మంచి సంస్కారం అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పరీక్ష ఉంటుందని, వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు.
చిన్నారులు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, చెడు అంశాలను పట్టించుకోకుండా మంచి ఆలోచనలు చేస్తూ మంచిని ఆస్వాదిస్తూ చదువుకోవాలన్నారు. చిన్న వయసులోనే లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, దాన్ని నెరవేర్చేందుకు క్రమశిక్షణతో ముందుకెళ్లాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఎదుగుదల కోసం నిరంతరం కష్టపడుతుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. సమాజంలో మంచి సంస్కారమంతమైన పౌరులుగా ఎదగాలని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ప్రతిరోజు కష్టపడుతూ చదివిస్తున్నారని, వారి కష్టాన్ని గుర్తించి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మూడు రోజులపాటు వివిధ సినిమాలను ప్రదర్శించనున్నారు. అంతకు ముందు కలెక్టర్ పమేలా సత్పతికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ఆలపించిన చిన్నారి పిచ్చుక వీడియోతోపాటు పంచతంత్ర బాలల చిత్రాన్ని ప్రదర్శించారు. భగవతి స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు.
కార్యక్రమంలో కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, అడ్వైజర్ వరాల మహేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీగౌతమ్, ఉపాధ్యక్షుడు సయ్యద్ ముజఫర్, భగవతి విద్యా సంస్థల చైర్మన్ రమణారావు, అన్నవరం దేవేందర్, కందుకూరి అంజయ్య, వెంకటేశం, దశరథం, సురేష్, చెన్న అనిల్ కుమార్, పిఎస్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
