పోపూరి లలిత కుమారి(Popuri Lalitha Kumari). ఈ పేరు చాలా మంది సాహిత్యాభిమానులకు తెలియదు. కానీ.. ఓల్గా అంటే.. తెలియని సాహితీప్రియులు ఉండరు. తెలుగునాట ఆమె పరిచయం అవసరంలేని అభ్యుదయ రచయిత్రి (Progressive writer). ఓల్గా అంటే వెయ్యి వోల్టుల అక్షర ప్రవాహం. ఆమె రచనలు కణకణ మండే నిప్పు కణికలు. ఆమె ప్రసంగాలు భగభగ మండే నినాదాలు. ఓల్గా.. అసలు సిసలు స్త్రీవాది(Feminist). ఆమెకు స్త్రీవాదమే సందర్భం. స్త్రీవాదమే ఉద్యమం. స్త్రీవాదమే సాహత్యం. స్త్రీవాదమే నేపథ్యం. స్త్రీవాదం సాహిత్యంలో, సమాజంలో బలంగా నాటుకు పోవాలన్నదే ఆమె సంకల్పం.
బలమైన ఉద్యమాలను నిర్మించుకుంటూ వెళితే తప్ప ఆకాశంలో సగం లాంటి పదాలకు న్యాయం చేకూరదని ఆమె నమ్మారు. అందుకు ఆమె సాహిత్యాన్ని (Literature) ఎంచుకున్నారు. ఆమె పెరిగిన నేపథ్యం, చుట్టూ ఉన్న సాన్నిహిత్యం, చదువుకున్న సాహిత్యం.. అన్నీ కలగలిపి అభ్యుదయ భావాలకు ఊపిరిలూదాయి. గోర్కీ లాంటి అనువాద పుస్తకాలు, పదో ఏటనే శ్రీశ్రీ మహాప్రస్థానం ఆమెపై ఎంతో ప్రభావం చూపాయి. తర్వాత.. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనలతో ప్రభావితమై, స్త్రీ చైతన్యం అంశంగా రచనలు చేసి, తనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఓల్గాగా సుపరిచితులైన “పోపూరి లలిత కుమారి”కి ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ, సాహిత్య రంగాల చర్చలో స్త్రీవాద ధృక్పథాన్ని ప్రవేశపెట్టిన తెలుగు రచయిత్రిగా ఆమె గుర్తింపు పొందారు. ప్రగతిశీల రచయిత్రిగా ఓల్గా కథలు, నవలలు, పద్యాలు స్త్రీ సాహిత్యంలో ఎన్నదగినవి. పత్రికల్లో, సాహిత్యంలో, అనువాదాల్లో మహిళల హక్కులపై విస్తృత చర్చలకు ఆమె తెర లేపారు. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా.. తననుతాను తెలుగులో గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించారు.
1950 నవంబర్ 27న గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర విద్య(ఎంఏ) పూర్తిచేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా చేశారు. చలనచిత్ర రంగంలో ‘ఉషా కిరణ్’ సంస్థకు కథా రచయిత్రిగా పని చేసి 3 చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందారు. ఆమె రాసిన “స్వేచ్ఛ” నవలను వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.
1986 నుంచి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్‌లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా చేశారు. 1991 నుంచి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్‌కు అధ్యక్షురాలిగా ఉన్నారు. అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్.. ఓల్గా రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదాలను తమ సంగ్రహంలో చేర్చారు. రాజకీయ కథలు-1993, స్వేచ్ఛ-1994, సహజ-1995, ప్రయోగం-1995, మానవి-1998, కన్నీటి కెరటాల వెన్నెల-1999, గులాబీలు-2000, ఆకాశంలో సగం(ఉత్తమ నవల పురస్కారం), పలికించకు మౌన మృదంగాలు, అలజడి మా జీవితం, జీవితం, కన్నీటి కెరటాల వెన్నెల, అక్షర యుద్ధాలు-2009, అతడు ఆమె మనం-2005, నవలా మాలతీయం-2006, సరిహద్దులు లేని సంధ్యలు తదితరాలు ఆమె ప్రముఖ రచనలు.
“స్వేచ్చ” నవలకు 1987-ఉషోదయ పబ్లికేషన్స్ ఉత్తమ నవల రచయిత అవార్డు, 1990-ఉదయం మ్యాగజీన్.. ‘తోడు’ అనే కథకు ఉత్తమ నవల రచయిత అవార్డు, 1998-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు(ఉత్తమ కథా రచయిత), 1999-తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ స్త్రీ రచయిత అవార్డు, 2014-లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఓల్గా ఎంపిక య్యారు. 2015లో “విముక్త” కథల సంపుటి ద్వారా ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సంకలనాన్ని డాక్టర్ కె.రామచంద్రమూర్తి, డాక్టర్ ఎ.మంజులత, డాక్టర్ జి.యోహాన్ బాబుల జ్యూరీ బృందం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించేవి అని ఆమె పేర్కొన్నారు. నేటి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై.. వాటిని అధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో. తమను హింసించే భర్తల నుంచి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటూనే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు-ద్వేషంతో తమనుతాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు-ఆ స్త్రీల కోసం ఈ కథలు అని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరి నుంచి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం” అంటారు స్వేచ్ఛ నవల రాసిన సందర్భంలో. స్త్రీ ఎదుర్కొనే ప్రతి సమస్య.. ఆమె ఒక్కో కథలో కనిపిస్తుంది. ప్రత్యేకత.. దాని ప్రయోజకత్వం. తాను సాహిత్యానికి ఓ ప్రయాజనం ఉండాలన్న ఆశయంతోనే రచనలు మొదలుపెట్టానని చెబుతారు ఓల్లా. ప్రతి కథలోనూ తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఆమె కథలో ఓ సూటిదనం కనిపిస్తుంది. అందులో ఒక్కోసారి సుదీర్ఘ చర్చలూ వినిపిస్తాయి. చివరికి ఓ పరిష్కారమూ ఉంటుంది. ఇలా స్త్రీ విముక్తి కోసం ఆమెకు ఉన్న మొక్కవోని ధృఢ సంకల్పం.. ఆమె ప్రతి కథలోనూ కనిపిస్తుంది.
(నవంబర్ 27న ఓల్గా జన్మదినం సందర్భంగా)
- రామకిష్టయ్య సంగన భట్ల
