Wednesday, February 11, 2026
Homeసాహిత్యంVande Mataram | వందేమాతరం @ 150

Vande Mataram | వందేమాతరం @ 150

బ్రిటిష్ పాలన(British Rule)కు వ్యతిరేకంగా భారతీయుల్లో (Indians) దేశభక్తి, జాతీయ ఐక్యత, స్వాతంత్ర్య ఉద్యమం (Freedom Fight) కోసం ఒక శక్తివంతమైన నినాదం (Slogan) వందేమాతర గీతం. ఈ గీత రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ (Bankim Chandra Chatterjee). భారతీయ బెంగాలీ (Bengali) సాహిత్యం(Literature)లో ఒక అగ్రశ్రేణి రచయిత. వందేమాతరం అనేది ఆయన 1875లో సంస్కృతం(Sanskrit)లో రాసిన కవిత. ఇది ప్రధానంగా ఆయన బెంగాలీ భాషలో 1882లో ప్రచురించిన నవల “ఆనందమఠ్”లో వచ్చింది. వందేమాతరానికి సాహిత్యపరమైన అర్థం “అమ్మా! నీకు నేను నమస్కరిస్తున్నాను”. ఈ పాట సాహిత్యం భారతమాతకు నివాళి. భరతమాత సౌందర్యం, వైభవం ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది.

1873లో క్రికెట్ మైదానంలో ఛటర్జీకి ఎదురైన అవమానాలు, ఆంగ్లేయుల వేధింపులతో దేశభక్తి భావాన్ని రేకెత్తించే వందేమాతరం గీతం పురుడుపోసుకుందని చరిత్ర చెబుతోంది. భారతీయ జాతీయతలో అద్భుతమైన ప్రభావం చూపించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో సంగీతాన్ని, స్వరాన్ని ఇచ్చి ప్రజలకు మరింత దగ్గర చేశారు. వందేమాతరం ద్వారా బంకించంద్ర ఛటర్జీ భారతీయులకు తమ తల్లి(మాతృభూమి)ని ప్రేమించమని, ఆమెను దుర్గా మహాదేవి రూపంలో ఆరాధించి, తిరుగుబాటు స్ఫూర్తిని పెంపొందించాలని ప్రేరేపించారు.

- Advertisement -

ఈ గీతం భారతీయుల హృదయాల్లో జాతీయ గర్వాన్ని కలిగించింది. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా ఒక్కటై దేశ ప్రేమకై మనసులందరినీ అనుసంధానించింది. హుగ్లీ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజీల్లో విద్యతో అనుసంధానం కలిగి ఉన్న ఛటర్జీ.. ఆంగ్లేయుల పాలన సమయంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసినప్పటికీ తన రచనల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తినిచ్చారు.

ఉద్యమాలకు ఊపిరి

1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, 1938 తెలంగాణ విద్యార్థి ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటంలో పలువురి ప్రాణనాదంగా “వందేమాతరం” మారింది. ఉరిశిక్షలకు గురైన విప్లవ కారులు, పోరాటంలో పాల్గొన్న విద్యార్థులు, దేశమాత పైన ప్రేమ ప్రదర్శిస్తూ ఈ గీతాన్ని ఆలపించారు.

వందేమాతరం.. విద్యార్థి ఉద్యమం

1938లో తెలంగాణ విద్యార్థి ఆందోళన.. “వందేమాతరం” గీతంపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించడం వల్ల మొదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ ఉద్యమం నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రాథమిక హక్కుల కోసం జరిగిన తిరుగుబాటుకు ప్రతీకగా మారింది. ఈ ఉద్యమం తెలంగాణ అంతటా వ్యాపించి జాతీయవాద స్ఫూర్తిని రేకెత్తించింది.

జాతీయ గీతం హోదా.. సమానత

1947 ఆగస్టు 15 ఉదయం స్వాతంత్ర్య దినోత్సవంలో ఆకాశవాణిలో మొదట శబ్దించిన గీతం కూడా ఇదే. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్తులో వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించారు. జనగణమనతో సమాన హోదాను కల్పించడంతోపాటుగా ప్రతి సందర్భంలో గౌరవప్రదంగా వినిపించిస్తూ దేశ బాధ్యతను, ప్రేమను, ఏకత్వాన్ని ప్రతిబింబించేలా ఈ గేయాన్ని నిలబెట్టారు.

150 ఏళ్లు నిండిన శుభ తరుణాన..

2025 నవంబర్ 7న వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు, పాఠశాలలు, సంస్థలు, రాష్ట్రాల్లో సమూహ గీత ఆలాపన నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రజల్లో జాతీయ భావనను మరింత ముడిపెట్టేలా మాన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. వందేమాతరం దేశ ఆత్మను, ఐక్యతను, నిబద్ధతను, గౌరవాన్ని ప్రతిబింబించే జాతీయ గేయం. ప్రజల్లో జాతీయ చైతన్యం పెంచుతూ స్వాతంత్ర్యం కోసం నిలదీయబడిన పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ఈ గీతం 150 ఏళ్ల పరమ పవిత్ర చరిత్రను కొత్త తరాలకు అందించే అవకాశం ఈ వేడుకల ద్వారా లభించనుంది.

  • కమలేకర్ నాగేశ్వర్ రావు
- Advertisement -
RELATED ARTICLES

Latest News