Sunday, February 22, 2026
HomeతెలంగాణVenezuela | వెనిజులాపై దాడి సామ్రాజ్యవాద దేశ సందేశమా?

Venezuela | వెనిజులాపై దాడి సామ్రాజ్యవాద దేశ సందేశమా?

అమెరికా ప్రత్యేక బలగాలు వెనిజులా రాజధాని కారకాస్ పై చేసిన సాహసోపేత దాడిలో అధ్యక్షుడు నికోలాస్ మడురో, భార్య సిలియా ఫ్లోర్స్ ఇద్దరినీ బెడ్రూమ్ నుంచే తీసుకెళ్ళి న్యూయార్క్ జైలులో బంధించడం ప్రపంచ రాజకీయాలను కుదిపేసింది. తొలుత వెనెజువెలా ను తామే పాలిస్తామని ట్రంప్ ప్రకటించారు, తర్వాత వెనక్కి తగ్గారు. మూడు రోజుల తర్వాత కూడా ఈ మొత్తం ఘటన వెనుక ఉన్న ట్రంప్ ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏమిటో అర్థం కాలేదు.

వెనిజులా 303 బిలియన్ బ్యారెల్ల చమురు నిల్వలు స్వాధీనం చేసుకోవడం, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడం, పెట్రోడాలర్ వ్యవస్థను కాపాడడం, మదురో ప్రభుత్వాన్ని అస్థిరపర్చి బొలివేరియన్ సోషలిజాన్ని కుప్పకూల్చడం కోసం వంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఎప్పీన్ కేసు నుంచి దృష్టి మరల్చడానికి, 2026 నవంబర్ లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ట్రంప్ రాజకీయ ఎత్తుగడ అనే వాదనలు కూడా చర్చల్లో ఉన్నాయి.

- Advertisement -

అమెరికా ఎప్పీన్ కేసు ఏమిటి?

ఎప్పీన్ కేసు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇది రాజకీయంగా, న్యాయపరంగా, సామాజికంగా సంచలనం రేపిన ఒక లైంగిక దోపిడీ కేసు, బాలికల అక్రమ రవాణా పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన చిన్నారి బాలికలు, యువతులకు ఉద్యోగం, మోడలింగ్, చదువు అవకాశాల పేరుతో ప్రలోభపెట్టి తన ఇళ్లకు తీసుకెళ్లేవాడన్న ఆరోపణల కేసు ఇది. ఎప్పీన్ అనే వ్యక్తికి అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయన్న వార్తలు, ఫొటోలు బయటకు రావడంతో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఒకరినొకరు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.

ఎప్పీన్ కేసులోని ఫైల్స్ను పూర్తిగా బయట పెట్టే బిల్లుపై సంతకం చేయడం, ఆ ఫైల్స్లో ఎవరి పేర్లు ఉన్నాయనేది అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో ఎప్పీన్ జైలులో ఊచల మధ్యనే మరణించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ట్రంప్ ప్రభుత్వాధినేతలతో ఎప్పీన్ కు సంబంధాలున్నాయి అనే ఆరోపణలకు మరింత బలం చేకూరింది. తద్వారా ట్రంప్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా ప్రజలు, విపక్షాల దృష్టి మరల్చడానికి ట్రంప్ ఈ చర్యలకు దిగాడన్న ఆరోపణలున్నాయి.

వెనిజులా చమురు క్షేత్రాలపై ట్రంప్ అజమాయిషీ ఎందుకు?

వెనెజువెలా చమురు క్షేత్రాలపై అజమాయిషీ కోసం ప్రయత్నం చేయడాన్ని ట్రంప్ సమర్థించుకున్నాడు, అమెరికన్ కంపెనీలే తమ పెట్టబడులతో వెనెజువెలా చమురు రంగాన్ని నిర్మించాయని, సోషలిస్ట్ రాజ్యం జాతీయీకరణ చేసి చమురు కంపెనీలపై ఆధిపత్యం చెలాయించిందనీ, తిరిగి స్వతంత్రంగా ప్రైవేటుగా పునరుద్ధరణ చేసి వెనిజులా దేశ ప్రజలకు విద్యా, వైద్యం, ఉపాధి కల్పిస్తామనీ ట్రంప్ ఉద్ఘాటిస్తున్నారు. అయితే, చమురుపై ఆధిపత్యం కోసమే ఈ దుశ్చర్యకు దిగాడన్నది కొంతమేరకు నిజమైనా, నూటికి నూరు శాతం అదే కారణంగా చూపడానికి ఎటువంటి సహేతుకమైన ఆధారాలు లేవు. వెనిజులాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయన్నది నిజం, కానీ వెనిజులా క్రూడ్ లో వెనేడియం, నికెల్, ఐరన్, కాపర్ వంటి లోహాలు, సల్ఫర్ ఎక్కువగా ఉ న్నటువంటి తక్కువ నాణ్యత గల చమురు.

ప్రామాణికంగా 0.5 శాతం కన్నా ఎక్కువగా సల్ఫర్, ఇతర లోహాలు గల క్రూడ్ ను సోర్ క్రూడ్ అనీ, 0.5 శాతం కంటే తక్కువ సల్ఫర్, లోహాలు గల క్రూడ్ ను స్వీట్ క్రూడ్ అని అంటారు. వెనిజులా క్రూడ్ లో సల్ఫర్,ఇతర లోహాల సాంద్రత ఎక్కువగా ఉన్నందున పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులుగా శుద్ధిచేయడం అంత సులువుకాదు, దీని సేకరణ, శుద్ధి చేయడం అమెరికా రిఫైనరీలకు పెద్ద సవాలు, ఖర్చుతో కూడినది. జామ్ నగర్ రిలయన్స్ క్రూడ్ రిఫైనరీల వంటి అత్యాధునిక రిఫైనరీలు (నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ 20 కన్నా ఎక్కువ) మాత్రమే దీన్ని సమర్థవంతంగా శుద్దిచేయగలవు. అమెరికాకు ఇప్పటికే 14 మిలియన్ బ్యారెల్ల డబ్ల్యూటీఐ (సల్ఫర్, లోహాల సాంద్రత తక్కువగా గల క్రూడ్), షేల్ ఆయిల్(రాతి పొరల నుండి సేకరించిన క్రూడ్) ఉత్పత్తి ఉంది. వెనిజువెలా చమురు పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించడానికి సుమారు 30 బిలియన్ డాలర్లు అవసరం, పైగా 3 సంవత్సరాలు పడుతుంది.

ఇప్పటికిప్పుడు వెనిజువెలా చమురు ఉత్పత్తి రెట్టింపైనా (900,000 నుంచి 2 మిలియన్ బ్యారెల్లు), ప్రపంచ మార్కెట్లో 1-3% మాత్రమే తప్ప, దీని ప్రభావం పెద్దగా ఉండదు. వెనుజులా చమురు పరిశ్రమ ఉ త్పత్తి పెరిగి, తక్కువ ధరకు ప్రపంచ మార్కెట్లో అమ్మాలని చూసినా, పెట్రోలియం ఎగుమతి చేసే పెట్రో ఆధారిత ఆర్థిక వ్యవస్థ గల అంతర్జాతీయ దేశాలు చమురు ధరలు తగ్గించి మార్కెట్ విస్తరణను అడ్డుంటాయి. ట్రంప్ చేసిన ఈ దాడి చమురు కోసమే కాదు, ఇదో రాజకీయ సందేశం, ట్రంప్ పాలనలో అంతర్జాతీయ చట్టాలు, దేశ సార్వభౌమత్వం పట్టించుకోకుండా దేశాధ్యక్షుడినే నిర్భందించడంతో మరోమారు ట్రంప్ నియంతృత్వాన్ని, అమెరికా సామ్రాజ్యవాద పోకడలను ప్రపంచ దేశాలు తిట్టిపోస్తున్నాయి.

ప్రపంచంలో వెనిజులా వంటి దేశాల పరిపాలనల్లో సమస్యలు ఉన్నా, ఇలాంటి హింసాత్మక చర్యలు ప్రపంచ శాంతిని దెబ్బతీస్తాయి. భారత్ వంటి దేశాలు చమురు ఆధారిత దేశాల (వెనిజువెలా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, అరబ్ ఎమిరేట్స్) ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేలా, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి. ఒక దేశం లేదా ప్రాంతం తన ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, గృహాలు, రవాణా వ్యవస్థలకు అవసరమైన శక్తిని (చమురు, విద్యుత్, గ్యాస్) స్థిరంగా, సరసమైన ధరలపై పొందే దేశాలపై ఈ ఘటన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ట్రంప్ వ్యూహాత్మకంగా అది చమురు కోసమే చేసాడు అనేదానికంటే ఇదో రాజకీయ సందేశం, ఎత్తుగడ అన్న వాదనే బలమైనది.

మోదీ ట్రంప్ ను ఎలా సంతోషపెట్టాలి?

భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎక్కువ మొత్తం క్రూడ్ రష్యాదే, అయితే చైనా, రష్యా, భారత్ క్రూడ్ కొనుగోలు, అమ్మకాలు యువాన్, రూబుల్, రూపాయలలో వ్యాపారం చేస్తున్నాయి, సౌదీ అరేబియా కూడా బ్రిక్స్ దేశాలతో చర్చలు జరుపుతుండటంతో, పెట్రోడాలర్ వ్యవస్థపై ప్రభావం పడి డాలర్ బలహీనమయ్యే పరిస్థితి ఏర్పడింది. రష్యా క్రూడ్ తక్కువ ధరకు లభించడంతో గత కొద్ది సంవత్సరాలుగా అంబానీ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడుతూ రష్యా క్రూడ్ కొనుగోలు చేస్తున్నాడు, తక్కువ ధరలకు కొనుగోలు చేసి నెదర్లాండ్స్, యూరప్ దేశాలు, అరబ్ దేశాలు, సౌత్ ఆఫ్రికా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. అంబానీ లాభాలు రష్యాతో ముడిపడి ఉన్నాయి, బిజేపీ ప్రయోజనాలు అంబానీ తో ముడిపడి ఉన్నాయి. అటు భారత్ పై దూకుడుగా అధిక సుంకాలతో సామ్రాజ్యవాద అమెరికా ఒత్తిడి, భారత పెట్టుబడిదారుల ఒత్తిడులతో బిజేపీ అధికారంలో దేశ ప్రజల ప్రయోజనాలు ప్రశ్నార్థకంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News