Saturday, April 11, 2026
Homeబిజినెస్UPI | యూపీఐ పేమెంట్స్ కు పదేళ్లు..

UPI | యూపీఐ పేమెంట్స్ కు పదేళ్లు..

  • కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..

భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీల్లో ఏకంగా 49 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. గణాంకాల ప్రకారం.. కేవలం 2026 జనవరి నెలలోనే యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.28.33 లక్షల కోట్లు.

దేశంలోని మొత్తం రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో 81 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ప్రారంభమైన నాటి నుంచి లావాదేవీల పరిమాణంలో 12,000 రెట్లు, విలువలో 4,000 రెట్లకు పైగా వృద్ధిని యూపీఐ నమోదు చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సైతం యూపీఐని ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అభివర్ణించింది. కేవలం లావాదేవీల సంఖ్యకే పరిమితం కాకుండా యూపీఐ సామాన్యుడి జీవితంలో కూడా భాగమైంది.

- Advertisement -

ఆటోరిక్షా డ్రైవర్ల నుంచి వీధి వ్యాపారులు, గ్రామీణ మార్కెట్ల వరకు యూపీఐ సేవలు విస్తరించాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, అధికారిక, అనధికారిక ఆర్థిక వ్యవస్థల మధ్య అంతరాన్ని తగ్గించి, ఆర్థిక సమ్మిళితత్వానికి మార్గం వేసిందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. భారత యూపీఐ వ్యవస్థ పనితీరు, భద్రత, వేగాన్ని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయి. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ సహా 8 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News