Tuesday, February 10, 2026
Homeఅంతర్జాతీయంDonald Trump | దూకుడుగా వెళ్తున్న ట్రంప్..

Donald Trump | దూకుడుగా వెళ్తున్న ట్రంప్..

  • గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో వెనుదిరిగేది లేదు..
  • యుద్ధ విమానం మొహరించేందుకు అమెరికా సిద్ధం..
  • గ్రీన్ ల్యాండ్ భవితవ్యంపై నెలకొన్న ఉత్కంఠ..
  • పెద్ద సంఖ్యలో బలగాలను గ్రీన్ ల్యాండ్కు తరలించిన డెన్మార్క్..

గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థావరం వద్ద యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలతో గ్రీన్లాండ్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఏ క్షణాన ఏ ప్రకటన చేస్తారో, ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలనే అమెరికా ఆశలను ఉద్దేశిస్తూ.. ఫ్రాన్స్ బహిరంగ విమర్శలు చేసింది. అమెరికా, కెనడా సంయుక్త రక్షణ సంస్థ అయిన ‘నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ’ తాజాగా గ్రీన్లాండ్కు సంబంధించి తమ సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.

త్వరలోనే తమ సైనిక విమానం పిటుఫిక్ స్పేస్ బేస్కు చేరుకుంటుందని అందులో వెల్లడించింది. ఈ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన తమ దీర్ఘకాల ప్రణాళికల్లో భాగంగా ఈ మోహరింపు చేపట్టనున్నట్లు పేర్కొంది. కెనడా, డెన్మార్క్ రాజ్యం సమన్వయంతో ఈ కార్యకలాపాలు జరగనున్నాయని, గ్రీన్లాండ్ ప్రభుత్వానికి దీని గురించి ముందుగానే సమాచారం అందించామని నోరాడ్ తెలిపింది. అయితే దీనిపై డెన్మార్క్ నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా దుందుడుకు చర్యల నేపథ్యంలో డెన్మార్క్ పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను గ్రీన్లాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. బలగాలు, సైనిక పరికరాలను మోసుకెళ్లిన అనేక విమానాలు సోమవారం గ్రీన్లాండ్కు చేరుకున్నాయని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకు దృష్టి సారించారనే దానిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భవిష్యత్తులో రష్యా నుంచి వచ్చే ముప్పు నుంచి కాపాడుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిపై ఫ్రాన్స్ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. ‘ఏదోఒక రోజు మంటలు చెలరేగితే.. అగ్నిమాపక సిబ్బంది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఇంటిని తగలెట్టేయడం మంచిది.

ఏదో ఒకరోజు కారుకు ప్రమాదం జరిగితే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇప్ప్పుడే కారుకు యాక్సిడెంట్ చేయడం మంచిదని అంటూ వ్యంగాస్త్రాలు విసిరింది. ఇక, గ్రీన్లాండ్ సాధించుకునేందుకు అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలపై ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్కూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు ఈయూ, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలను ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News